Page Loader
PAC-SEBI: నేడు పీఏసీ ఎదుట హాజరుకానున్న సెబీ చైర్‌పర్సన్ మాధబి..
నేడు పీఏసీ ఎదుట హాజరుకానున్న సెబీ చైర్‌పర్సన్ మాధబి..

PAC-SEBI: నేడు పీఏసీ ఎదుట హాజరుకానున్న సెబీ చైర్‌పర్సన్ మాధబి..

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 24, 2024
08:38 am

ఈ వార్తాకథనం ఏంటి

సెబీ చైర్‌పర్సన్ మాధబి పూరీ బుచ్ గురువారం రోజు పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) ముందు హాజరు కావాల్సి ఉంది. కమిటీ ఇప్పటికే మాధబికి సమన్లు జారీ చేయడంతో, సెబీ పనితీరును సమీక్షించడానికి పీఏసీ సిద్ధమైంది. కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది. అయితే, ఈ చర్యలను భారతీయ జనతా పార్టీ తప్పుపట్టింది. బీజేపీ సీనియర్ నాయకులు, మాధబిని రాజకీయ ప్రేరేపణలతోనే పిలిచారని ఆరోపించారు. పార్లమెంట్ చట్టం ద్వారా నియంత్రణ సంస్థల పనితీరును సమీక్షించడానికి పార్లమెంట్ కమిటీకి అధికారాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆర్థికశాఖ, సెబీ ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొనాల్సి ఉంటుంది.

వివరాలు 

మాధబి పూరీ బుచ్‌ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు

ఇక, కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన దర్యాప్తులో మాధబి లేదా ఆమె కుటుంబంపై ఎలాంటి అవకతవకలు లభించలేదని సమాచారం. మాధబి పూరీ బుచ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోబోమని, రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ఉన్నత వర్గాలు పేర్కొన్నట్లు సమాచారం. సెబీ చీఫ్ హోదాలో ఉంటూ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందారన్న ఆరోపణలపై కూడా పార్లమెంటరీ కమిటీ విచారణ చేపట్టింది. అయితే, మాధబి లేదా ఆమె కుటుంబ సభ్యులు తప్పు చేసినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని దర్యాప్తులో తేలింది.

వివరాలు 

ఆఫ్‌షోర్ కంపెనీల్లో మాధబి పెట్టుబడులు

అదానీ గ్రూప్‌కు చెందిన ఆఫ్‌షోర్ కంపెనీల్లో మాధబి పెట్టుబడులు పెట్టారని హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. సెబీ చైర్‌పర్సన్ హోదాలో ఉన్న సమయంలో పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందారని, ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి వేతనం పొందుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. మాధబి తన కన్సల్టెన్సీ సంస్థ అగోరా అడ్వైజరీ ప్రైవేటు లిమిటెడ్‌కి సెబీతో సంబంధాలు ఉన్నాయని విమర్శలు వచ్చాయి. కానీ ఈ ఆరోపణలను మాధబి తోసిపుచ్చి, ఇవి తమ ప్రతిష్టను దెబ్బతీయడానికి చేసిన చర్యలేనని పేర్కొన్నారు.