RBI: అభివృద్ధికి అడ్డంకులను అధిగమిస్తాం: RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా
ఈ వార్తాకథనం ఏంటి
అభివృద్ధికి అడ్డంకిగా ఉన్నవాటిని అధిగమించేందుకు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నామని ఆర్ బి ఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రాపేర్కొన్నారు. సోమవారం జరిగిన వార్షిక బ్యాంకింగ్ సమావేశం 'FIBAC 2025'లో ప్రసంగిస్తూ, బ్యాంక్ క్రెడిట్‌ను విస్తరించే దిశగా తగిన చర్యలు తీసుకోవాలని తాము పరిశీలిస్తున్నామని ఆయన అన్నారు. పెట్టుబడుల చక్రాన్ని (ఇన్వెస్ట్‌మెంట్ సైకిల్) బలంగా మలచాలంటే కార్పొరేట్లు, బ్యాంకులు ఒకే వేదికపైకి వచ్చి కలిసి పనిచేయాలని సూచించారు. అలా జరిగితేనే దేశం అభివృద్ధి దిశగా ముందుకు కదులుతుందని స్పష్టం చేశారు. ధరల స్థిరత్వం,ఆర్థిక వృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని ద్రవ్య పరపతి విధానం (Monetary Policy) కొనసాగుతుందని ఆయన వివరించారు.
వివరాలు
భారత్ వద్ద 695 బిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్య నిల్వలు
భారత ఆర్థిక వ్యవస్థ పునాదులు దృఢంగా ఉన్నాయని మల్హోత్రా విశ్లేషించారు. అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ సానుకూలత, ఆశావాహ వాతావరణం కొనసాగుతుందని అన్నారు. భారత్ త్వరలోనే ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచే అవకాశం ఉన్నదని ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశం వద్ద 695 బిలియన్ అమెరికన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నాయని చెప్పారు. ఈ నిల్వలు 11 నెలలపాటు విదేశీ వాణిజ్య అవసరాలను తీర్చగలవని వివరించారు. ఇప్పుడు దేశం సమృద్ధి భారత్ సాధనపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సూచించారు. అదనంగా, త్వరలో ఏర్పాటు కానున్న రెగ్యులేటరీ రివ్యూ సెల్ ప్రతి 5 నుంచి 7 సంవత్సరాలకు ఒకసారి ప్రస్తుత నిబంధనలను సమీక్షించనుందని ఆయన వెల్లడించారు.