
RBI Interest Rates: ట్రంప్ టారిఫ్ బెదిరింపుల మధ్య ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. 5.5 శాతం వద్దే వడ్డీ రేట్లు
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఏడాది ఇప్పటికే మూడు సార్లు వడ్డీ రేట్లను తగ్గిస్తూ ఆర్ బి ఐ కీలక నిర్ణయాలు తీసుకున్నా,తాజా సమీక్షలో మాత్రం జాగ్రత్తగా వ్యవహరించింది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన టారిఫ్‌లు కలిగించిన అనిశ్చితి దృష్ట్యా, రిజర్వ్ బ్యాంక్ ఈసారి వడ్డీ రేట్లను యథాతథంగా 5.5 శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ద్రవ్య పరపతి సమీక్ష ఫలితాలను బుధవారం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల్లో కొంత పరిణామం చోటుచేసుకున్నప్పటికీ, ముఖ్యంగా అమెరికా టారిఫ్‌లపై స్పష్టత రాకపోవడం వల్ల, వడ్డీ రేట్ల విషయంలో ఏ మార్పు చేయకూడదని ఆర్బీఐ భావించింది.
వివరాలు
ప్రస్తుతం అనుసరిస్తున్న స్థిర విధానాన్ని ఇంకొంతకాలం కొనసాగిస్తాం: గవర్నర్
ద్రవ్య పరపతి విధానాలపై మౌలికంగా ఏకాభిప్రాయానికి వచ్చిన కమిటీ, రెపో రేటును 5.5 శాతంగా కొనసాగించాలనే నిర్ణయాన్ని ఏకగ్రీవంగా తీసుకుంది. ప్రస్తుతం అనుసరిస్తున్న స్థిర విధానాన్ని ఇంకొంతకాలం కొనసాగిస్తామని గవర్నర్ తెలిపారు. గత మూడు సమీక్షలలో ఆర్బీఐ అనుసరించిన విధానాన్ని పరిశీలిస్తే - ఫిబ్రవరిలో, ఏప్రిల్‌లో వరుసగా 25 బేసిస్ పాయింట్లు వడ్డీ రేట్లను తగ్గించింది. అనంతరం జూన్ సమీక్షలో మాత్రం ఒక్కసారిగా 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గింపును ప్రకటించింది. ఫలితంగా ఈ ఏడాది మొత్తం రెపో రేటు మొత్తం మీద 1 శాతం వరకూ తగ్గిపోయింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తన ప్రసంగంలో పలు కీలక విషయాలను ప్రస్తావించారు.
వివరాలు
ద్రవ్యోల్బణం స్థిరంగా 4 శాతంతో కొనసాగుతోంది
ప్రస్తుతం దేశవ్యాప్తంగా రుతుపవనాలు బాగా కొనసాగుతున్నాయని, ఫలితంగా వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే అవకాశం ఉందని చెప్పారు. సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగా వర్షాలు పడటం వల్ల ద్రవ్యోల్బణం తగ్గే అవకాశముందని తెలిపారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత బలాన్నిస్తుందన్నారు. ఇప్పటికే ద్రవ్యోల్బణం స్థిరంగా 4 శాతంతో కొనసాగుతుందని గవర్నర్ వెల్లడించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం 3.1 శాతానికి దిగొచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. అదే సమయంలో, కరెంట్ అకౌంట్ లోటు స్థిర స్థాయిలో కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యప్రవాహం కూడా మిగులు స్థాయిలోనే ఉందన్నారు.
వివరాలు
ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 6.5 శాతం
ఇదే ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 6.5 శాతం వరకు ఉండొచ్చని గవర్నర్ పేర్కొన్నారు. అయితే ప్రపంచ రాజకీయ వాతావరణంలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు ఈ వృద్ధికి ప్రధాన అడ్డంకిగా మారే అవకాశాన్ని కూడా గవర్నర్ ఖచ్చితంగా హెచ్చరించారు.