
P2M payments: పర్సన్ టు మర్చంట్ లావాదేవీలపై పరిమితిని పెంచుకునేందుకు ఎన్‌పీసీఐకి ఆర్‌బీఐ అనుమతి
ఈ వార్తాకథనం ఏంటి
డిజిటల్ లావాదేవీల పెరుగుతున్న వినియోగాన్నిదృష్టిలో పెట్టుకుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
వ్యక్తులు వ్యాపారులకు చేసే పర్సన్ టు మర్చెంట్(P2M)చెల్లింపుల పరిమితిని వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా పెంచుకునే అవకాశం కల్పించింది.
ఈ నిర్ణయానికి అనుగుణంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఆర్‌బీఐ ఆమోదం తెలిపింది.
ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా ఈ నిర్ణయాన్ని కేంద్ర బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు.
యూపీఐ(UPI)వ్యవస్థను మరింత సమర్థంగా మార్చే దిశగా ఈ ప్రతిపాదన తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు.
వినియోగదారుల అవసరాలను, బ్యాంకులు,ఆర్థిక సంస్థల సూచనలను పరిశీలించిన తర్వాత,NPCI P2M చెల్లింపుల పరిమితిని పెంచే వీలుందని ఆయన స్పష్టం చేశారు.
వివరాలు
పీ2ఎం లావాదేవీల పరిమితిని రూ.2 లక్షలు లేదా రూ.5 లక్షల వరకు పొడిగించే వీలు
అయితే,ఈ మార్పుల వల్ల ఏర్పడే భద్రతా సమస్యల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మల్హోత్రా సూచించారు.
యూపీఐ వ్యవస్థలో భద్రతకు ప్రాధాన్యతనిస్తూ,సంబంధిత పరిమితులపై NPCI నిర్ణయాలు తీసుకోవడానికి బ్యాంకులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని ఆయన వెల్లడించారు.
ప్రస్తుతం యూపీఐ ద్వారా వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి (P2P) వ్యక్తి నుంచి వ్యాపారులకు (P2M) జరిగే చెల్లింపులకు రూ.లక్ష వరకు పరిమితి ఉంది.
కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, పీ2ఎం లావాదేవీల పరిమితిని రూ.2 లక్షలు లేదా రూ.5 లక్షల వరకు పొడిగించే వీలుంది.
ఇప్పుడు ఆర్‌బీఐ తాజాగా ప్రకటించిన ప్రకారం,ఈ పరిమితిని మరింత పెంచుకోవచ్చని తెలిపింది. అయితే, పీ2పీ చెల్లింపుల పరిమితిలో ఎలాంటి మార్పులు చేయడం లేదని స్పష్టంగా పేర్కొంది.