GST: రూ.2000 లోపు పేమెంట్లపై 18 శాతం GST.. కీలక విషయాలు వెల్లడించిన ఆ మంత్రి
కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.2000 లోపు పేమెంట్లపై జీఎస్‌టీ విధించకుండా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించింది. అయితే, తాజాగా అందిన సమాచారం ప్రకారం, ఈ ట్రాన్సాక్షన్లపైనా పన్ను భారం మోపేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. రేజర్ పే, పైన్ ల్యాబ్స్ వంటి పేమెంట్ అగ్రిగేటర్ల ద్వారా జరిగే చెల్లింపుల్లో రూ.2000 లోపు ఉన్న వాటికి కూడా జీఎస్‌టీ విధించే అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ఈ విధానం క్రింద రూ.2000 లోపు డెబిట్, క్రెడిట్ కార్డు పేమెంట్లపై జీఎస్‌టీ వసూలు చేయడం లేదు, కానీ మరింత పెరిగిన లావాదేవీలపై 18 శాతం జీఎస్‌టీ వర్తిస్తోంది.
ఈ అంశాన్ని ఫిట్ మెంట్ కమిటీకి పంపే అవకాశాలు
ఢిల్లీలో జరుగుతున్న 54వ జీఎస్‌టీ మండలి సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈ అంశంపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో ఉత్తరాఖండ్ ఆర్థిక మంత్రి ప్రేమ్‌చంద్ అగర్వాల్ కీలక విషయాలు వెల్లడించారు. రూ.2000 లోపు పేమెంట్లపై పేమెంట్ అగ్రిగేటర్ల ఆదాయంపై 18 శాతం జీఎస్‌టీ విధించాలన్న ప్రతిపాదనపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ అంశాన్ని ఫిట్ మెంట్ కమిటీకి పంపే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అదే సమయంలో, హెలికాప్టర్ ద్వారా ఆధ్యాత్మిక పర్యటనలపై ఉన్న జీఎస్‌టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించినట్లు ఆయన వెల్లడించారు.
రూ.2000 లోపు పేమెంట్లకు జీఎస్‌టీ మినహాయింపు
2017 నుంచి రూ.2000 లోపు పేమెంట్లకు జీఎస్‌టీ మినహాయింపు కల్పిస్తూ వస్తున్నారు. కానీ పేమెంట్ అగ్రిగేటర్లు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ల పరిధిలోకి రాకపోవడంతో వీటిపై జీఎస్‌టీ విధించాలన్న డిమాండ్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ అగ్రిగేటర్ల ద్వారా జరిగే 80 శాతం లావాదేవీలు రూ.2000 లోపు ఉన్నట్లు చెబుతున్నారు.