LOADING...
Madhabi Puri Buch:మాధబీ పూరి బుచ్,మరో 5 మందికి బాంబే హైకోర్టులో ఊరట 
మాధబీ పూరి బుచ్,మరో 5 మందికి బాంబే హైకోర్టులో ఊరట

Madhabi Puri Buch:మాధబీ పూరి బుచ్,మరో 5 మందికి బాంబే హైకోర్టులో ఊరట 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 04, 2025
01:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

సెబీ (SEBI) మాజీ చైర్‌పర్సన్ మాధవి పురి బచ్‌ (Madhabi Puri Buch)కు బాంబే హైకోర్టు నుంచి తాత్కాలిక ఊరట లభించింది. అవినీతి నిరోధక విభాగం (ACB) ప్రత్యేక న్యాయస్థానం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని జారీ చేసిన ఉత్తర్వులపై ఆమెతో పాటు మరో ఐదుగురు ఉన్నతాధికారులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు, నాలుగు వారాలపాటు కింది కోర్టు ఉత్తర్వులను నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ''కింది కోర్టు పూర్తిస్థాయిలో పరిశీలన చేయకుండా ఈ ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇరుపక్షాల వాదనలు పరిశీలించిన అనంతరం వాటిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం,'' అని హైకోర్టు వ్యాఖ్యానించింది.

వివరాలు 

చర్చనీయాంశమైన హిండెన్‌బర్గ్  నివేదిక

థానేకి చెందిన జర్నలిస్ట్ సపన్‌ శ్రీవాత్సవ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో కంపెనీల లిస్టింగ్ ప్రక్రియలో భారీ ఆర్థిక మోసం,అవినీతి జరిగిందని ఆరోపిస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇటీవల ప్రత్యేక న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాధవి పురి బచ్‌ సహా ఐదుగురు ఉన్నతాధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. గత కొంతకాలంగా మాధవి పురి బచ్ వివాదాల్లో చిక్కుకుంటున్నారు.అదానీ గ్రూప్‌కు చెందిన ఆఫ్‌షోర్ కంపెనీల్లో ఆమె పెట్టుబడులు పెట్టారని హిండెన్‌బర్గ్ గతేడాది ఆగస్టులో వెల్లడించిన నివేదిక చర్చనీయాంశమైంది. అనంతరం ఆమెపై మరిన్ని ఆరోపణలు వచ్చాయి.ఇందులో ఆమె భర్త ధావల్ బచ్‌కు కూడా పెట్టుబడులు ఉన్నాయని పేర్కొనడం మరింత చర్చకు దారితీసింది. అయితే ఈఆరోపణలు నిరాధారమైనవని బచ్ దంపతులు వివరణ ఇచ్చారు.