Page Loader
Madhabi Puri Buch: స్టాక్‌ మార్కెట్‌ మోసాల కేసులో.. సెబీ మాజీ చీఫ్‌కు తాత్కాలిక ఊరట
స్టాక్‌ మార్కెట్‌ మోసాల కేసులో.. సెబీ మాజీ చీఫ్‌కు తాత్కాలిక ఊరట

Madhabi Puri Buch: స్టాక్‌ మార్కెట్‌ మోసాల కేసులో.. సెబీ మాజీ చీఫ్‌కు తాత్కాలిక ఊరట

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 03, 2025
01:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్టాక్ మార్కెట్ మోసాల కేసులో సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) మాజీ చైర్‌పర్సన్ మాధవి పురి బుచ్ (Madhabi Puri Buch)కు కొంతవరకు ఊరట లభించింది. ముంబై ప్రత్యేక కోర్టు (Mumbai Sessions Court) ఆమెతో పాటు మరో ఐదుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించగా, ఈ ఆదేశాల అమలును నిలిపివేయాలని బాంబే హైకోర్టు (Bombay High Court) సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. మాధవి పురి బుచ్, మరో ఐదుగురిపై స్టాక్ మార్కెట్ మోసాలు, నియంత్రణ ఉల్లంఘనలకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ముంబై ప్రత్యేక కోర్టు శనివారం ఏసీబీకి ఆదేశాలు ఇచ్చింది.

వివరాలు 

రేపటికి ఈ పిటిషన్లపై పూర్తి విచారణ

అయితే,ఈ ఆదేశాలను సవాలు చేస్తూ మాధవి పురి బుచ్,హోల్ టైమ్ సభ్యులు అశ్వని భాటియా, అనంత్ నారాయణ్ జి, కమలేష్ చంద్ర వర్ష్నీ, బీఎస్‌ఈ చైర్మన్ ప్రమోద్ అగర్వాల్, సీఈవో సుందరరామన్ రామమూర్తిలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలను అత్యవసరంగా స్వీకరించిన బాంబే హైకోర్టు, మంగళవారం వరకు ముంబై ప్రత్యేక కోర్టు ఆదేశాల అమలును నిలిపివేయాలని మహారాష్ట్ర అవినీతి నిరోధక విభాగానికి న్యాయమూర్తి శివకుమార్ డిగే ఆదేశించారు. రేపటికి ఈ పిటిషన్లపై పూర్తి విచారణ చేపట్టనుంది.

వివరాలు 

సెబీ మాజీ చీఫ్‌పై కేసు 

స్టాక్ మార్కెట్ మోసాలు, నియంత్రణ సంబంధిత నిబంధనల ఉల్లంఘనల ఆరోపణల నేపథ్యంలో, సెబీ మాజీ చైర్‌పర్సన్ మాధవి పురి బుచ్,మరో ఐదుగురిపై ప్రత్యేక కోర్టు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. నియంత్రణ విధానాల్లో లోపాలు ఉన్నట్లు,కొందరు వ్యక్తులు కుమ్మక్కయినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. ఈ అంశంపై న్యాయబద్ధమైన,నిష్పక్షపాత దర్యాప్తు అవసరమని స్పష్టం చేసింది. విచారణను తాను పర్యవేక్షిస్తానని న్యాయమూర్తి ప్రకటించారు. ఓ మీడియా రిపోర్టర్ దాఖలు చేసిన ఫిర్యాదుపై ఈ కేసు నమోదు చేయాలని ప్రత్యేక కోర్టు నిర్ణయం తీసుకుంది. ఓ కంపెనీ స్టాక్ ఎక్సేంజ్‌లో మోసపూరితంగా లిస్టింగ్ అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే, దీనిపై రెగ్యులేటరీ అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్లే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయని కోర్టు అభిప్రాయపడింది.

వివరాలు 

అదానీ విదేశీ ఫండ్ల వివాదం - సెబీ చీఫ్‌పై దుమారం 

అదానీ గ్రూప్‌కు చెందిన విదేశీ ఫండ్ల వ్యవహారంలో సెబీ చైర్‌పర్సన్ మాధవి పురి బుచ్, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని హిండెన్‌బర్గ్ నివేదికలో ఆరోపణలు వెల్లువెత్తాయి. షార్ట్ సెల్లింగ్ సంస్థ, మార్కెట్ రీసెర్చ్ కంపెనీ అయిన హిండెన్‌బర్గ్ నివేదిక దేశవ్యాప్తంగా సంచలనాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఈ నివేదిక నేపథ్యంలో పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (Public Accounts Committee) కూడా సెబీ చీఫ్‌కు సమన్లు జారీ చేసింది. అయితే, విచారణ అనంతరం ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.