Page Loader
RBI New Governer: ఆర్‌బీఐ నూతన గవర్నర్‌గా సంజయ్‌ మల్హోత్ర నియామకం
ఆర్‌బీఐ నూతన గవర్నర్‌గా సంజయ్‌ మల్హోత్ర నియామకం

RBI New Governer: ఆర్‌బీఐ నూతన గవర్నర్‌గా సంజయ్‌ మల్హోత్ర నియామకం

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 09, 2024
05:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌గా రెవెన్యూ శాఖ కార్యదర్శి సంజయ్‌ మల్హోత్రాను నియమించింది. ఆయన రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌గా మూడు సంవత్సరాలు పని చేయనున్నారు. ప్రస్తుతం గవర్నర్‌గా ఉన్న శక్తికాంత దాస్‌ 2024 డిసెంబర్‌ 10న తన పదవీ కాలాన్ని ముగించుకుంటున్నారు. ఈ సందర్భంలో కొత్త గవర్నర్‌ నియామకానికి సంబంధించి డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసాయి. సంజయ్‌ మల్హోత్రా ప్రస్తుతం రెవెన్యూ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన బుధవారం (డిసెంబర్‌ 11) తన పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఉన్న గవర్నర్ శక్తికాంత దాస్‌ 2018 డిసెంబర్‌లో ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఐదేళ్ల గరిష్ఠకాలం కంటే ఎక్కువకాలం ఈ పదవిలో కొనసాగారు.

వివరాలు 

తమిళనాడు ప్రభుత్వంలో ముఖ్య కార్యదర్శిగా శక్తికాంత

బెనెగల్‌ రామారావు తర్వాత అత్యంత కాలం గవర్నర్‌గా పనిచేసిన వ్యక్తిగా నిలిచారు. 2021లో ఆయన మళ్లీ మూడేళ్లకాలం కోసం కేంద్రం నుంచి పదవీ విస్తరణ పొందారు. 2018లో ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా చేసిన తర్వాత శక్తికాంత రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు.ఆయన తమిళనాడు కేడర్‌కు చెందిన 1980బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. శక్తికాంత ఆర్థిక వ్యవహారాలు,రెవెన్యూ శాఖలో పలు కీలక పదవులలో పనిచేశారు. ఆయన ప్రపంచ బ్యాంక్,ఏడీబీ,ఎన్‌డీబీ,ఏఐఐబీలో గవర్నర్‌గా ఉన్నారు. తమిళనాడు ప్రభుత్వంలో ముఖ్య కార్యదర్శిగా(పరిశ్రమలు),ప్రత్యేక కమిషనర్‌గా (రెవెన్యూ),రెవెన్యూ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. భువనేశ్వర్‌లో జన్మించిన శక్తికాంత ఢిల్లీలోని సెయింట్‌ స్టీఫెన్‌ కళాశాలలో హిస్టరీలో బ్యాచిలర్‌, మాస్టర్స్‌ డిగ్రీలు పొందారు. 2024లో గ్లోబల్ ఫైనాన్స్‌లో టాప్‌ సెంట్రల్‌ బ్యాంకర్‌గా ఎంపికయ్యే గౌరవాన్ని పొందారు.