
Indian Rupee: భారత్‌పై ట్రంప్ సుంకాల యుద్ధం.. అయినా బలపడిన రూపాయి
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌తో వాణిజ్యం విషయంలో అమెరికా కఠినంగా వ్యవహరించింది. భారతదేశం నుంచి జరిగే ఎగుమతులపై భారీగా సుంకాలు పెంచే నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే, ఈ పరిణామం రూపాయి మారకపు విలువపై వెంటనే ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపకపోవడం విశేషం. ఈ రోజు ఉదయం ట్రేడింగ్‌లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మూడు పైసలు బలపడింది. దీంతో రూపాయి విలువ 87.69 వద్ద నిలిచింది.
వివరాలు
సుంకాల పెంపునకు కారణం ఏమిటి?
భారతదేశం రష్యా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నందుకు నిరసనగా అమెరికా ఈ చర్యలు తీసుకుంది. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం, భారత ఉత్పత్తులపై అదనంగా 25 శాతం సుంకం విధిస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. దీంతో భారత ఎగుమతులపై మొత్తం సుంకాల భారం 50 శాతానికి పెరిగింది. ఇది భారత్‌పై విధించిన 'జరిమానా'గా ట్రంప్ వ్యాఖ్యానించారు. అంతేకాదు, రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్న ఇతర దేశాలపైనా ఇలాంటి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వివరాలు
అమెరికా నిర్ణయంపై తీవ్రంగా స్పందించిన భారత్
అమెరికా తాజా చర్యలపై భారత్ గట్టిగా స్పందించింది. ఈ నిర్ణయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ "అన్యాయమైనది,అసంబద్ధమైనది,కారణం లేనిదిగా"అభివర్ణించింది. "భారతదేశం తన 140 కోట్ల జనాభా ఇంధన అవసరాలను దృష్టిలో పెట్టుకుని,మార్కెట్ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది.ఈ విషయాన్ని మేము ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టం చేశాం," అని పేర్కొంది. అంతేకాదు, ఇతర దేశాలూ తమ జాతీయ ప్రయోజనాల కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయని, అలాంటప్పుడు కేవలం భారత్‌ను లక్ష్యంగా చేసుకోవడం అన్యాయమని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. ఆర్థిక నిపుణులు ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తూ, భవిష్యత్తులో మరింత సంక్లిష్టత రావచ్చని అంచనా వేస్తున్నారు.