Sam Altman: మైక్రోసాఫ్ట్‌లోకి శామ్ ఆల్ట్‌మన్.. ధ్రువీకరించిన సత్య నాదెళ్ల
ఓపెన్ఏఐ నుంచి ఉద్వాసనకు గురైన శామ్ ఆల్ట్‌మన్ సంబంధించి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కీలక ప్రకటన చేశారు. ఆల్ట్‌మన్ తన కంపెనీ కొత్త కృత్రిమ మేధ పరిశోధన బృందంలో చేరనున్నట్లు సోమవారం సత్యనాదెళ్ల తెలిపారు. ఆయనతో పాటు ఓపెన్ఏఐ నుంచి బయటికొచ్చిన గ్రెగ్ బ్రాక్ మెన్ సైతం మైక్రో సాఫ్ట్‌తో చేతులు కలిపినట్లు ధ్రువీకరించారు. ఇక ఆల్ట్ మన్, బ్రాక్‌మన్ కలిసి మైక్రోసాప్ట్ ఏఐ టీమ్‌కు నేతృత్వం వహించనున్నారు. వారి విజయానికి కావాల్సిన వనరులు సమకూర్చేందుకు తాము వేగంగా చర్యలు చేపడుతామని సత్య నాదెళ్ల ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు.
ఓపెన్ఏఐ బోర్డు సీఈఓగా ఎమ్మెట్ షియర్
ఇక వీడియో స్ట్రీమింగ్ సైట్ ట్విచ్ సహ వ్యవస్థాపకుడు ఎమ్మెట్ షియర్ ను తాత్కాలిక సీఈఓగా ఓపెన్ఏఐ బోర్డు నియమించింది. మరోవైపు ఆల్ట్‌మన్‌ను తొలగించిన వెంటనే సీఈఓ బాధ్యతలను మిరా మురాటి స్వీకరించింది. ఆమె కూడా ఆల్ట్‌మన్‌కు మద్దతు పలకడంతో మరో వ్యక్తిని ఆ పదవిలోకి తీసుకొచ్చారు. ఓపెన్ఏఐ సీఈఓగా శామ్ ఆల్ట్‌మన్ ను తిరిగి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఆయన విధించిన కొన్ని షరతులను యాజమాన్యం అంగీకరించడం పోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. ముఖ్యంగా ఓపెన్ఏఐ ఆల్ట్‌మన్‌ను విశ్వసించకపోవడమే కారణమని బోర్డు ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.