
SEBI Chairman: ఎఫ్‌అండ్‌ఓ ఎక్స్‌పైరీలపై నిర్ణయం తీసుకోలేదు: సెబీ
ఈ వార్తాకథనం ఏంటి
స్టాక్ మార్కెట్‌లో స్పెక్యులేటివ్ వ్యాపారాలను నియంత్రించేందుకు వారంతపు ఎక్స్‌పైరీలపై ఎలాంటి మార్పులు చేయబోతున్నట్లు తన వద్ద ఎటువంటి ప్రతిపాదనలూ లేవని, ప్రస్తుతం ప్రచారంలో ఉన్నవన్నీ ఊహలేనని బుధవారం సెబీ చైర్మన్ తుహిన్ కాంత్ పాండే స్పష్టత ఇచ్చారు. అలాంటి ప్రతిపాదనలు తమ వద్దకు వచ్చినట్లు ఎక్కడా నమోదు కాలేదని, మీడియాలో వచ్చిన కథనాలు పూర్తిగా అవాస్తవాలేనని ఆయన పేర్కొన్నారు. అయితే, ఇటువంటి విధాన మార్పులను చేపట్టే ముందు సంబంధిత విధిగా చర్చలు జరపాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఆయన వ్యాఖ్యల తర్వాత బీఎస్‌ఈ షేర్లు తిరిగి ఊపందుకున్నాయి. మధ్యాహ్నం 1 గంట సమయంలో అవి 1.50 శాతం పెరిగి రూ.2405 వద్ద ట్రేడయ్యాయి.
వివరాలు
ప్రచారం జరిగినట్లు మారితే.. ఇవి ప్రతి రెండు వారాలకు ఒకసారి ముగుస్తాయి
వాస్తవానికి మంగళవారం కొన్ని మీడియా సంస్థలు "సెబీ వారానికి ఒకసారి జరిగే ఎక్స్‌పైరీల్ని నిలిపివేస్తోంది, వాటిని రెండు వారాలకొకసారి నిర్వహించేలా మారుస్తోంది" అనే కథనాలను ప్రచురించాయి. ఇది నిజం అయితే, బీఎస్‌ఈ, నిఫ్టీ ఎఫ్ అండ్ ఓ(F&O)ఎక్స్‌పైరీ తేదీల్లో మార్పులు జరగాల్సి వస్తుంది. ప్రస్తుతం బీఎస్‌ఈ ఎఫ్ అండ్ ఓ కాంట్రాక్టులు మంగళవారమే ఎక్స్‌పైర్ అవుతుండగా, నిఫ్టీ50 కాంట్రాక్టులు గురువారం ముగుస్తున్నాయి. కానీ ప్రచారం జరుగుతున్నట్లుగా మార్పులు జరిగితే, వీటిని ప్రతి రెండు వారాలకు ఒకసారి మాత్రమే ముగించేలా కొత్త విధానం అమలులోకి రావాలి. ఇటీవల సెబీ ఫుల్‌టైమ్ మెంబర్ అయిన అనంత్ నారాయణన్,చిన్న కాలం ఎఫ్ అండ్ ఓ కాంట్రాక్టుల్లో విపరీతమైన వాల్యూమ్‌లతో ట్రేడింగ్ జరుగుతున్నదాన్ని గమనించి ఆందోళన వ్యక్తం చేశారు.
వివరాలు
2024 ఆర్థిక సంవత్సరంలో రూ.74,812 కోట్లుగా నమోదు
ఆయన వ్యాఖ్యల్లో,ఈ కాంట్రాక్టుల నాణ్యతను మెరుగుపరచడానికి వాటి గడువును పెంచే అవకాశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఈ వ్యాఖ్యలు కూడా ఇటీవల జరిగిన పుకార్లకు బలాన్ని చేకూర్చాయి.ఇప్పటికే సెబీ చాలా నియంత్రణలు తీసుకొచ్చింది. ముఖ్యంగా గత సంవత్సరం నవంబర్‌లో మార్కెట్‌లో అత్యధిక హెచ్చుతగ్గులను నియంత్రించేందుకు అనేక మార్పులను తీసుకొచ్చింది. ఈ మార్పుల ప్రభావం కూడా మార్కెట్ విధానాలపై పడింది. ఇక ఈ ఏడాది జూలైలో సెబీ చేసిన ఓ అధ్యయనంలో కీలక విషయాలు బయటపడ్డాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో చిల్లర మదుపుదారులు 2025 ఆర్థిక సంవత్సరంలో సుమారుగా రూ.1.06 లక్షల కోట్లు నష్టపోయినట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. ఇది గత 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.74,812 కోట్లుగా నమోదైంది.