Page Loader
Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. రాణించిన హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌.. 
లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. రాణించిన హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌..

Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. రాణించిన హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 21, 2025
04:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. విశ్లేషకుల అంచనాలను అధిగమిస్తూ త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్ల మంచి ప్రదర్శన మార్కెట్‌ సూచీలకు బలాన్నిచ్చింది. రెండు రోజులు వరుస నష్టాల అనంతరం సూచీలు తిరిగి లాభాల బాటపట్టినట్లు కనిపించాయి. ఇదే సమయంలో, రికార్డు స్థాయి త్రైమాసిక ఫలితాలను ప్రకటించినా రిలయన్స్ ఇండస్ట్రీస్‌ షేర్లు 3 శాతం కంటే ఎక్కువ నష్టపోయాయి. సెన్సెక్స్‌ ఉదయం 81,918.53 పాయింట్ల వద్ద స్వల్ప లాభాలతో ప్రారంభమైంది. ఇది గత ముగింపైన 81,757.73 పాయింట్ల కంటే కొంత మెరుగైన స్థాయిలో మొదలైంది. అయితే వెంటనే నష్టాల్లోకి జారుకుంది. కొంతకాలానికే మళ్లీ లాభాల్లోకి వచ్చి, రోజంతా లాభాలతోనే కొనసాగింది.

వివరాలు 

డాలరుతో రూపాయి మారకం విలువ 86.30

ఇంట్రాడే ట్రేడింగ్‌లో 82,274.03 పాయింట్ల వద్ద day's highను తాకిన సెన్సెక్స్‌ చివరకు 442.61 పాయింట్ల లాభంతో 82,200.34 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 122.30 పాయింట్ల లాభంతో 25,090.70 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.30గా ఉంది. సెన్సెక్స్‌ 30 షేర్లలో ఎటర్నల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, మహీంద్రా అండ్ మహీంద్రా, బీఈఎల్‌ షేర్లు లాభాలతో ముగిశాయి. అయితే రిలయన్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, హిందుస్థాన్ యూనిలీవర్‌, టీసీఎస్‌, ఐటీసీ షేర్లు నష్టాల్లో ముగియడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్ల విషయానికి వస్తే.. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కి 69.04 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు ధర 3374 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.