Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల వరుస లాభాలకు బ్రేక్.. సెన్సెక్స్ 56 పాయింట్లు,నిఫ్టీ 35 పాయింట్ల చొప్పున నష్టం
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు మదుపర్లను ఆకర్షించకపోవడంతో ఐదు రోజుల లాభాలకు ముగింపు పడింది. కీలకమైన రెపో రేటును స్థిరంగా ఉంచిన ఆర్ బి ఐ, క్యాష్ రిజర్వ్ రేషియో (CRR)ను 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అయితే, జీడీపీ వృద్ధి మందగింపు నేపథ్యంలో సీఆర్‌ఆర్ తగ్గించొచ్చనే అంచనాలు ఇప్పటికే ఉన్నందున, ఆర్‌బీఐ ప్రకటన మార్కెట్‌లో ఉత్సాహాన్ని కలిగించలేకపోయింది. ఈ కారణంగా సూచీలు రోజంతా ఒడిదుడుకుల మధ్య కదలాడాయి.
డాలరుతో రూపాయి మారకం విలువ 84.69గా నమోదైంది
సెన్సెక్స్ ఉదయం స్వల్ప లాభాలతో 81,887.54 పాయింట్ల వద్ద ప్రారంభమై, ఇంట్రాడేలో 81,506.19 నుంచి 81,925.91 పాయింట్ల మధ్య కదిలి, చివరికి 56.74 పాయింట్ల నష్టంతో 81,709.12 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 35.85 పాయింట్ల నష్టంతో 24,672.55 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.69గా నమోదైంది. సెన్సెక్స్ 30 సూచీల్లో టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకీ, ఎల్‌అండ్‌టీ, ఐటీసీ లాభపడగా, అదానీ పోర్ట్స్, భారతీ ఎయిర్‌టెల్, ఏషియన్ పెయింట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్ నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 71.62 డాలర్ల వద్ద కొనసాగగా, బంగారం ఔన్స్ ధర 2660 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.