Page Loader
Stock Market: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వడ్డీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో.. సెన్సెక్స్ 700 పాయింట్లు జంప్‌
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వడ్డీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో.. సెన్సెక్స్ 700 పాయింట్లు జంప్‌

Stock Market: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వడ్డీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో.. సెన్సెక్స్ 700 పాయింట్లు జంప్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 06, 2025
11:37 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ప్రస్తుతం లాభాల దిశగా ప్రయాణిస్తున్నాయి. విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగా, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌ బి ఐ) కీలక వడ్డీ రేట్లను వరుసగా మూడోసారి తగ్గించడంతో మార్కెట్లకు ఊతమిచ్చింది. తాజా ప్రకటనలో ఏకంగా 50 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించినట్టు తెలియజేయడంతో, సూచీలు పరుగులు తీస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఆటోమొబైల్‌, రియల్‌ ఎస్టేట్‌ రంగాల షేర్లు మంచి లాభాల్లో ఉన్నాయి. బ్యాంక్‌ నిఫ్టీ కొత్త గరిష్ఠస్థాయిని చేరుకుంది.

వివరాలు 

నిఫ్టీ@ 24,975

ఉదయం 11:12 గంటల సమయంలో, సెన్సెక్స్‌ 701 పాయింట్ల లాభంతో 82,143 స్థాయిలో కొనసాగుతుండగా, నిఫ్టీ 224 పాయింట్లు పెరిగి 24,975 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌కు చెందిన 30 ప్రధాన షేర్లలో బజాజ్‌ ఫైనాన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, మారుతీ సుజుకీ, ఎటర్నల్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), అదానీ పోర్ట్స్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, టెక్‌ మహీంద్రా, ఎన్టీపీసీ, ఎంఅండ్‌ఎం షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు, సన్‌ఫార్మా, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్‌ మాత్రం స్వల్ప నష్టాల్లో ఉన్నాయి.

వివరాలు 

తగనున్న గృహ, వాహన, ఇతర రుణాలపై వడ్డీ భారం

తాజా నిర్ణయం ప్రకారం, రెపో రేటు 6 శాతం నుంచి 5.50 శాతానికి తగ్గించారు. ఇప్పటికే ఈ సంవత్సరంలో ఫిబ్రవరి, ఏప్రిల్‌ నెలల్లో కూడా ఆర్‌బీఐ 25 బేసిస్‌ పాయింట్ల చొప్పున వడ్డీ రేట్లను తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ విధంగా ఇప్పటివరకు మొత్తం రెపో రేటులో ఒక శాతం తగ్గింపునకు కేంద్ర బ్యాంక్‌ వెళ్లింది. వడ్డీరేటు తగ్గడంతో గృహ, వాహన, ఇతర రుణాలపై వడ్డీ భారం మరింత తగ్గనుంది. దీని ప్రభావంగా రియల్‌ ఎస్టేట్‌ రంగ షేర్లు వేగంగా పుంజుకుంటున్నాయి. అంతేకాకుండా, ఈ తగ్గింపుతో మార్కెట్లో నాణేల ప్రవాహం పెరిగే అవకాశముంది.