Page Loader
Stock Market : నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. నిఫ్టీ@24,700 
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. నిఫ్టీ@24,700

Stock Market : నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. నిఫ్టీ@24,700 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 13, 2025
04:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. ఇజ్రాయెల్,ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి ముదిరిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. దీని ప్రభావం భారత మార్కెట్లపై కూడా స్పష్టంగా కనిపించింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే సూచీలు క్షీణించాయి. ఈ నేపథ్యంలో బీఎస్ఈ సెన్సెక్స్ 1,000 పాయింట్లకు పైగా కోల్పోయింది, నిఫ్టీ సూచీ 24,600 దిగువకు చేరింది. చివరికి ఈ రెండు ప్రధాన సూచీలు నష్టాల్లోనే ముగిశాయి.సెన్సెక్స్ ఉదయం భారీ నష్టాలతో 80,427.81 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఇది మునుపటి ముగింపు స్థాయి అయిన 81,691.98 పాయింట్ల కంటే తక్కువ. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 80,354.59 వద్ద కనిష్ఠ స్థాయిని తాకింది.

వివరాలు 

డాలరుతో రూపాయి మారకం విలువ 86.07

చివరికి 573 పాయింట్ల నష్టంతో 81,118 వద్ద సెషన్ ముగిసింది. నిఫ్టీ సూచీ ఇంట్రాడేలో 24,473.00 పాయింట్ల కనిష్ఠాన్ని చేరుకుని, చివరికి 169 పాయింట్ల నష్టంతో 24,718 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.07గా నమోదైంది. మరోవైపు,ముడి చమురు ధరల పెరుగుదల,విదేశీ సంస్థాగత మదుపుదారుల (FII) అమ్మకాలు మార్కెట్ సెంటిమెంట్‌ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ముఖ్యంగా చమురు రంగానికి చెందిన షేర్లపై ఒత్తిడి మరింత పెరిగింది. సెన్సెక్స్‌లో భాగమైన 30 స్టాక్స్‌లో అధిక భాగం నష్టపోయాయి.

వివరాలు 

బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 75.39 డాలర్లు 

వీటిలో అదానీ పోర్ట్స్‌, ఐటీసీ, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టైటాన్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, అల్ట్రాటెక్ సిమెంట్‌, పవర్‌గ్రిడ్‌, బజాజ్‌ఫిన్‌సర్వ్‌, ఎటర్నల్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు నష్టాల బాట పట్టాయి. అయితే, టెక్ మహీంద్రా, టీసీఎస్‌, సన్‌ఫార్మా, మారుతీ సుజుకీ షేర్లు మాత్రం ఈ ఒత్తిడిలోనూ లాభాలను నమోదు చేశాయి. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 75.39 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం ఔన్సు ధర 3,445 డాలర్ల వద్ద కొనసాగుతోంది.