Page Loader
Stock Market : భారీ నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 1000 పాయింట్లు డౌన్‌
భారీ నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 1000 పాయింట్లు డౌన్‌

Stock Market : భారీ నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 1000 పాయింట్లు డౌన్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 13, 2025
09:46 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి. ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమనడంతో అంతర్జాతీయంగా మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఈ పరిణామాల ప్రభావం భారత మార్కెట్లపైనూ స్పష్టంగా కనిపించింది. ట్రేడింగ్‌ ప్రారంభమైన కొద్దిసేపటిలోనే సెన్సెక్స్‌ 1000 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ సూచీ 24,600 దిగువకు పడిపోయింది. ఉదయం 9:20 గంటల సమయానికి సెన్సెక్స్‌ 920 పాయింట్ల నష్టంతో 80,782 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 279 పాయింట్ల నష్టంతో 24,608 స్థాయిలో ఉంది. సెన్సెక్స్‌లో భాగమైన 30 షేర్లన్నీ నష్టాల్లోనే కదలాడుతున్నాయి.

వివరాలు 

బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 75.80 డాలర్లు 

ముఖ్యంగా ఎల్‌అండ్‌టీ, అదానీ పోర్ట్స్‌, ఇన్ఫోసిస్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎంఅండ్‌ఎం, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టెక్‌ మహీంద్రా, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎస్‌బీఐ, టాటా మోటార్స్‌ షేర్లు గణనీయంగా నష్టపడ్డాయి. విదేశీ మారక మార్కెట్‌లో రూపాయి విలువ డాలరుతో పోలిస్తే 86.15 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 75.80 డాలర్ల వద్ద ఉంది. బంగారం ధర ఔన్సుకు 3,451 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అమెరికా మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ముగిశాయి.

వివరాలు 

నష్టాల్లో ట్రేడవుతున్న ఆసియా మార్కెట్లు

నాస్‌డాక్‌ 0.24 శాతం, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.38 శాతం, డోజోన్స్‌ 0.24 శాతం మేర లాభపడ్డాయి. అయితే మిడిల్‌ఈస్ట్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు మాత్రం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. జపాన్‌ నిక్కీ 1.33 శాతం, హాంగ్‌సెంగ్‌ 0.77 శాతం, షాంఘై 0.78 శాతం, ఆస్ట్రేలియన్‌ ఏఎస్‌ఎక్స్‌ 0.22 శాతం నష్టాలను నమోదు చేశాయి. మరోవైపు, విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) గురువారం నికరంగా రూ.3,831 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అదే సమయంలో దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.9,394 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.