Page Loader
Stock market:నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 239 పాయింట్లు, నిఫ్టీ 73 పాయింట్ల నష్టం 
నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock market:నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 239 పాయింట్లు, నిఫ్టీ 73 పాయింట్ల నష్టం 

వ్రాసిన వారు Sirish Praharaju
May 28, 2025
04:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు కనిపించినా, దేశీయంగా బ్లాక్ డీల్స్ , ప్రైమరీ మార్కెట్‌లో యాక్టివిటీ పెరగడం వల్ల మదుపరులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మార్కెట్ వరుసగా రెండో రోజు కూడా నష్టాలను ఎదుర్కొంది. ట్రేడింగ్ రోజంతా సూచీలు స్థిరంగా కదిలి చివరికి నష్టాల్లో స్థిరమయ్యాయి. ముఖ్యంగా ఎఫ్‌ఎంజీసీ (FMCG) రంగానికి చెందిన షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

వివరాలు 

సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీల స్థితిగతులు 

సెన్సెక్స్‌ ఈరోజు ఉదయం 81,457.61 పాయింట్ల వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైంది. ఇది మునుపటి ముగింపు 81,551.63 పాయింట్ల కంటే స్వల్పంగా తక్కువ. ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఇది 81,613.36 పాయింట్ల గరిష్ఠ స్థాయి నుంచి 81,244.02 పాయింట్ల కనిష్ఠ స్థాయికి మధ్య కదలాడింది. చివరికి సెన్సెక్స్‌ 239 పాయింట్ల నష్టంతో 81,312.32 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా ఇదే దిశగా సాగింది. 73.75 పాయింట్లు నష్టపోయి 24,752.45 వద్ద స్థిరపడింది. రూపాయి మారకం విలువ డాలరుతో పోలిస్తే 85.37గా నమోదైంది.

వివరాలు 

నష్టపోయిన,లాభపడ్డ షేర్లు 

సెన్సెక్స్‌-30 సూచీలో ఐటీసీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, నెస్లే ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా వంటి కంపెనీల షేర్లు నష్టాల్లో ముగిశాయి. మరోవైపు, బజాజ్ ఫైనాన్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు లాభాలను నమోదు చేశాయి. అంతర్జాతీయంగా బ్రెంట్‌ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 64.61 డాలర్ల వద్ద కొనసాగుతోంది. బంగారం ఔన్సు ధర 3,317 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

వివరాలు 

ఎల్‌ఐసీ షేర్లలో భారీ లాభాలు 

ఎల్‌ఐసీ షేర్లు ఈ రోజు గణనీయంగా పెరిగాయి.మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.19,013 కోట్ల నికర లాభాన్ని (38 శాతం వృద్ధి)ప్రకటించడంతో,ఈ వార్త ప్రభావంతో షేర్లు ఉదయం 9 శాతం వరకు పెరిగాయి. చివరికి బీఎస్ఈలో రూ.69.30 (7.96%) లాభంతో రూ.940 వద్ద ముగిసాయి. ఎన్‌ఎస్‌ఈలో షేర్లు రూ.69.50 (7.98%) లాభంతో రూ.940.75 వద్ద స్థిరపడ్డాయి. ఐటీసీ షేర్ల పతనం - బ్లాక్ డీల్ ప్రభావం బ్రిటిష్ మల్టీనేషనల్ సంస్థ బీఏటీ పీఎల్‌సీ ఐటీసీలో తన 2.3శాతం వాటాను బ్లాక్ డీల్‌ ద్వారా విక్రయించింది. ఈ పరిణామం కారణంగా ఐటీసీ షేరు ధరలు తీవ్రంగా పడిపోయాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే షేర్లు 5 శాతం వరకూ తగ్గగా,చివరికి ఎన్‌ఎస్‌ఈలో 2.97శాతం నష్టంతో రూ.421వద్ద ముగిశాయి.