
Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@ 25,150
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మళ్లీ నష్టాలను చవిచూశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ, ట్రేడింగ్ ముగిసే సమయానికి సూచీలు నష్టాల్లో నిలిచాయి. భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై ఇంకా స్పష్టత లేకపోవడం,అలాగే నిరాశజనక త్రైమాసిక ఫలితాలు ప్రధాన కారణాలుగా పేర్కొనవచ్చు. ముఖ్యంగా ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ షేర్లలో భారీ అమ్మకాలు నమోదవడంతో మార్కెట్‌పై నెగెటివ్ ప్రభావం చూపినట్టు విశ్లేషకులు పేర్కొన్నారు. సెన్సెక్స్ ఉదయం 82,753.53 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది. కాగా, ఇది గత ట్రేడింగ్ రోజు ముగింపు స్థాయి అయిన 82,634.48 పాయింట్ల కంటే పై స్థాయిలోనే ప్రారంభమైంది. కానీ త్వరలోనే నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 82,219.27 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది.
వివరాలు
రూపాయి మారకం విలువ డాలరుతో పోలిస్తే 86.07గా నమోదు
చివరికి 375.24 పాయింట్ల నష్టంతో 82,259.24 వద్ద ట్రేడింగ్ ముగిసింది. మరోవైపు, నిఫ్టీ 100.60 పాయింట్లు పడిపోయి 25,111 వద్ద ముగిసింది. రూపాయి మారకం విలువ డాలరుతో పోలిస్తే 86.07గా ఉంది. సెన్సెక్స్ 30 షేర్లలో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎటర్నల్, ఎల్ అండ్ టీ షేర్లు ప్రధానంగా నష్టాలను నమోదు చేశాయి. అయితే టాటా స్టీల్, ట్రెంట్, టైటాన్, టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు మాత్రం లాభాల్లో కొనసాగాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల విషయానికి వస్తే, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 68.62 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అలాగే బంగారం ధర ఔన్సుకు 3,332.10 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.