Page Loader
Stock Market : భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు… 1000 పాయింట్లకు పైగా కోల్పోయిన సెన్సెక్స్‌
భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు… 1000 పాయింట్లకు పైగా కోల్పోయిన సెన్సెక్స్‌

Stock Market : భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు… 1000 పాయింట్లకు పైగా కోల్పోయిన సెన్సెక్స్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 12, 2025
04:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అస్తవ్యస్తమైన సంకేతాల మధ్య దేశీ సూచీలు ఉదయం ఫ్లాట్‌గా మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో కొద్దిసేపు లాభాల్లో కొనసాగిన మార్కెట్, తర్వాత ముఖ్యమైన షేర్లలో అమ్మకాలు ఊపందుకోవడంతో నష్టాల బాట పట్టింది. ఒక దశలో సెన్సెక్స్ ఏకంగా 1000 పాయింట్ల వరకూ నష్టపోయింది. నిఫ్టీ 24,900 మార్కు దిగువకు చేరిపోయింది. చివరికి ఈ రెండు ప్రధాన సూచీలు గణనీయమైన నష్టాలతో ముగిశాయి.

వివరాలు 

రూపాయి మారకం విలువ డాలరుతో పోలిస్తే 85.60

సెన్సెక్స్‌ ఈరోజు ఉదయం 82,571.67 పాయింట్ల వద్ద ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇది గత ముగింపు స్థాయి అయిన 82,515.14 పాయింట్లకు సమీపంగా ఉంది.ట్రేడింగ్‌లో ఈ సూచీ 81,523.16 నుంచి 82,661.04 మధ్య ఊగిసలాడింది. చివరకు 823 పాయింట్ల నష్టంతో 81,691.98 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా ట్రేడింగ్‌లో 24,825.90 పాయింట్ల కనిష్ఠాన్ని తాకి, చివరకు 253 పాయింట్ల నష్టంతో 24,888 వద్ద ముగిసింది. రూపాయి మారకం విలువ డాలరుతో పోలిస్తే 85.60గా ఉంది. సెన్సెక్స్‌-30లోకి వచ్చే కంపెనీల్లో టాటా మోటార్స్‌, టైటాన్‌, ఎటర్నల్‌, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌, టాటా స్టీల్‌, ఎల్‌అండ్‌టీ, ఎంఅండ్‌ఎం, హెచ్‌యూఎల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్‌, ఎస్‌బీఐ, ఎన్టీపీసీ, ఐటీసీ షేర్లు నష్టపోయాయి.

వివరాలు 

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్సు ధర 3,382 డాలర్లు

కేవలం బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఏషియన్ పెయింట్స్‌, టెక్ మహీంద్రా షేర్లకు మాత్రమే లాభాలభ్యమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్సు ధర 3,382 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఈరోజు అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం ప్రభావంతో విమానయాన రంగ షేర్లపై ఒత్తిడి పెరిగింది. దీనివల్ల ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో) షేర్లు 3 శాతం పైగా పడిపోయాయి. స్పైస్‌జెట్ షేర్లు కూడా 1.78 శాతం మేర కోలపోయాయి. మరోవైపు, అమెరికా ప్రీమార్కెట్లో బోయింగ్ కంపెనీ షేర్లు 8 శాతం వరకు పతనమయ్యాయి. ఎల్‌అండ్‌టీ, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ వంటి ప్రముఖ స్టాక్స్‌లో అమ్మకాలు జరగడం వల్ల మార్కెట్‌పై ఒత్తిడి పెరిగింది. దాదాపు అన్ని రంగాలకు చెందిన షేర్లు నష్టాల్లో ముగిశాయి.

వివరాలు 

మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు ఇవే: 

ఆసియా మార్కెట్లలో కూడా నష్టాల వాతావరణమే కనిపించింది. హాంగ్‌సెంగ్‌ సూచీ 1.36 శాతం, జపాన్‌ నిక్కీ 0.65 శాతం, ఆస్ట్రేలియా ఎస్‌ఎక్స్‌ 0.31 శాతం నష్టాల్లో ముగిశాయి. గత కొన్ని రోజులుగా కొనుగోళ్ల వైపు ఉన్న విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIలు), బుధవారం అమ్మకాలకు మొగ్గుచూపారు. వీరు సుమారు రూ.446 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఇది సూచీలపై మరింత ఒత్తిడికి దారి తీసింది. అంతర్జాతీయంగా అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రికత్తలు పెరగడం వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. ఫ్యూచర్ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 2.90 డాలర్ల మేర పెరిగి 69.77 డాలర్లకు చేరింది, ఇది 4 శాతం వృద్ధిని సూచిస్తోంది.