
Stock market:భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 1000 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్
ఈ వార్తాకథనం ఏంటి
గత సెషన్‌లో ట్రంప్ విధించిన టారిఫ్‌ల ప్రభావంతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు మంగళవారం తిరిగి ఊపందుకున్నాయి.
అమెరికా అనేక దేశాలతో సుంకాలపై చర్చలకు సిద్ధమని సంకేతాలు ఇవ్వడంతో, ఆసియాతోపాటు భారత మార్కెట్లు కూడా బలంగా ట్రేడయ్యాయి.
అంతేకాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నుంచి వడ్డీ రేట్లలో మరోసారి 25 బేసిస్ పాయింట్ల తగ్గుదల వచ్చే అవకాశం ఉండొచ్చన్న ఊహాగానాలు మార్కెట్‌కు తోడుగా నిలిచాయి.
ఈ నేపథ్యంలో, సెన్సెక్స్ ఒక దశలో 1600 పాయింట్లకు పైగా పెరిగింది.
నిఫ్టీ సూచీ 22,600 పాయింట్ల ఎగువను తాకింది. అయితే, ట్రేడింగ్ ముగింపులో అమ్మకాల ప్రభావంతో కొంత లాభాల స్వీకరణ చోటుచేసుకుంది.
వివరాలు
ఇంట్రాడేలో గరిష్ఠాన్ని తాకిన సూచీ
మంగళవారం ఉదయం సెన్సెక్స్ 74,013.73 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై, ఇంట్రాడేలో 74,859.39 పాయింట్ల గరిష్ఠానికి చేరుకుంది.
చివరికి 1089.18 పాయింట్ల లాభంతో 74,227.08 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 374.25 పాయింట్లు పెరిగి 22,535.85 వద్ద స్థిరపడింది.
రూపాయి మారకం విలువ డాలరుతో పోలిస్తే రూ.86.27గా నమోదైంది.
సెన్సెక్స్ 30 షేర్లలో పవర్ గ్రిడ్‌ను మినహాయిస్తే మిగిలిన అన్ని స్టాకులు లాభాల్లో ముగిశాయి.
ముఖ్యంగా టైటాన్, బజాజ్ ఫైనాన్స్, ఎల్‌అండ్‌టీ, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు ప్రధానంగా రాణించాయి.
బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ 100, స్మాల్‌క్యాప్ 100 సూచీలు సైతం సుమారుగా 2 శాతం లాభపడాయి.
వివరాలు
అంతర్జాతీయ మార్కెట్ల పరిస్థితి
ఆసియా-పసిఫిక్ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి.
జపాన్ నిక్కీ 5.68 శాతానికి పైగా లాభపడగా, హాంగ్‌కాంగ్, షాంఘై మార్కెట్లు సుమారు 1.5 శాతం లాభాలు నమోదు చేశాయి.
అయితే, సింగపూర్, తైవాన్, జకర్తా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. యూరోపియన్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి.
డోజోన్స్ ఫ్యూచర్స్ సుమారు 2 శాతం పెరిగాయి. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 64 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం ఔన్సు ధర 3020 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
వివరాలు
మార్కెట్ల లాభాలకు ముఖ్య కారణాలు
ట్రంప్ సుంకాలపై కొన్ని దేశాలతో చర్చలకు సిద్ధంగా ఉన్నారన్న ప్రకటన మార్కెట్లలో ఆశావహ వాతావరణాన్ని కలిగించింది. ట్రంప్ వైఖరిలో కొంత మార్పు వస్తుందన్న అంచనాలు వాణిజ్య యుద్ధ భయాలను తగ్గించాయి.
చైనా, వియత్నాం వంటి దేశాలతో పోలిస్తే ట్రంప్ సుంకాల ప్రభావం భారత్‌పై తక్కువగా ఉండొచ్చన్న అంచనాలు భారత మదుపర్లకు ఊరట ఇచ్చాయి.
ముడిచమురు ధరలు తగ్గిపోవడం కూడా మార్కెట్ ర్యాలీకి దోహదపడింది. తక్కువ స్థాయిలో కొనుగోళ్లు మార్కెట్ సూచీలకు మద్దతునిచ్చాయి.
ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. బుధవారం నిర్ణయాలు వెలువడనున్న నేపథ్యంలో, వడ్డీ రేట్లు 25 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం ఉందన్న అంచనాలు మార్కెట్లలో హుషారును తీసుకొచ్చాయి.
వివరాలు
మార్కెట్ల లాభాలకు ముఖ్య కారణాలు
అమెరికాలో 10 ఏళ్ల బాండ్ల రాబడి 4.5 శాతం నుంచి 4.14 శాతానికి తగ్గడం, 2 ఏళ్ల బాండ్ల రాబడి 3.715 శాతానికి పడిపోవడం, అమెరికా డాలర్ ఇండెక్స్ 102.92కి తగ్గిపోవడం వంటివి అభివృద్ధి చెందుతున్న దేశాలకు మేలు చేస్తాయని మదుపర్లు భావిస్తున్నారు. దీనివల్ల భారత మార్కెట్‌కి ఇది పాజిటివ్‌గా మారింది.