Stock market: భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. మైనస్ 1129 టు ప్లస్ 843
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. ఉదయం భారీ నష్టాలు నమోదు చేసిన సూచీలు, ఆ తర్వాత బలంగా పుంజుకుని సానుకూలంగా ముగిసాయి. ఉదయం 1,100 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్ చివరకు 840 పాయింట్ల లాభంతో ముగియడం విశేషం. కనిష్ఠ స్థాయిల నుంచి సుమారు 2,000 పాయింట్లు పుంజుకుంది. నిఫ్టీ 24,750 పైగా స్థిరంగా ముగిసింది. ముఖ్యంగా భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి షేర్లు మార్కెట్‌కు బలమైన మద్దతు అందించాయి. సెన్సెక్స్ ఈ ఉదయం 81,212.45 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమై ఒక దశలో 1,129 పాయింట్లు పడిపోయి 80,082.82 కనిష్ఠాన్ని తాకింది.
క్రూడ్ బ్యారెల్ ధర 73.94 డాలర్లు
అయితే, మధ్యాహ్నం ట్రేడింగ్ సమయంలో కొనుగోళ్లతో మళ్లీ పుంజుకుని,ఇంట్రాడే గరిష్ఠం 82,213.92 పాయింట్లను చేరుకుంది. చివరికి 843పాయింట్ల లాభంతో 82,133.12 వద్ద ముగిసింది.నిఫ్టీ కూడా ఒక దశలో 380పాయింట్ల నష్టంతో 24,180.80 కనిష్ఠాన్ని నమోదు చేసి,చివరికి 219.60 పాయింట్ల లాభంతో 24,768.30 వద్ద నిలిచింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.79గా ఉంది.సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్,ఇండస్ ఇండ్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్ మినహా అన్ని షేర్లు లాభాల్లో ముగిశాయి. భారతీ ఎయిర్‌టెల్, ఐటీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్, టైటాన్ వంటి షేర్లు ముఖ్యంగా లాభపడినవి. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 73.94 డాలర్లుగా ఉండగా, బంగారం ఔన్సు 2,688 డాలర్ల వద్ద కొనసాగుతోంది.