
Gold ATM: షాంఘైలో ప్రపంచంలోనే మొట్టమొదటి 'Gold ATM' ఏర్పాటు.. భారతదేశం తర్వాతి స్థానంలో ఉందా?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా గుర్తింపు పొందిన చైనా, సాంకేతిక రంగంలో పరుగులు పెడుతోంది.
కొత్త ఆవిష్కరణలతో ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇటీవలి కాలంలో, చైనాలోని అతిపెద్ద నగరంగా పేరుగాంచిన షాంఘైలో ఒక వినూత్న ప్రయత్నం చేశారు.
అక్కడి ఓ ప్రముఖ షాపింగ్ మాల్‌లో తొలి "గోల్డ్ ఏటీఎం"ను (Gold ATM) ఏర్పాటు చేశారు.
ఇది షాంఘై నగరంలో ఏర్పాటైన ప్రథమ బంగారపు ఏటీఎంగా గుర్తింపు పొందింది.
ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరుగుతుండటంతో, ఈ ప్రత్యేకమైన ఏటీఎం యంత్రం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది.
స్థానిక మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం, ఈ ఏటీఎం దగ్గర ఎప్పుడూ వినియోగదారులతో రద్దీగా ఉంటోంది.
వివరాలు
బంగారాన్ని తూకం వేస్తుంది
ఈ గోల్డ్ ఏటీఎం ప్రత్యేకత విషయానికొస్తే,ఇది 1200 డిగ్రీల సెల్సియస్ వద్ద బంగారాన్ని కరిగించి,దాని స్వచ్ఛతను పరీక్షిస్తుంది.
అంతేగాక ప్రత్యక్ష ధరను సైతం చూపిస్తుంది. వినియోగదారులు బంగారం విక్రయించిన తర్వాత, ఆ మొత్తానికి సమానంగా బ్యాంక్ ఖాతాకు డబ్బును బదిలీ చేసే విధంగా సదుపాయాన్ని కల్పించారు.
ఈ అత్యాధునిక ఫీచర్ల కారణంగా,ప్రజల్లో ఆసక్తి పెరిగిందని అక్కడి వర్గాలు వెల్లడించాయి.
ఈ యంత్రం ద్వారా బంగారంతో సంబంధిత లావాదేవీలు జరపడం చాలా సులభం.
మొదటగా, యంత్రం బంగారాన్ని తూకం వేస్తుంది. ఆ తర్వాత, అది 99.99 శాతం స్వచ్ఛమైనదా కాదా అన్న విషయాన్ని గుర్తిస్తుంది.
వివరాలు
చైన్ స్నాచర్లకు మాత్రం పండుగే
తదుపరి దశలో, షాంఘై గోల్డ్ ఎక్స్ఛేంజ్‌లో ప్రస్తుత బంగారం రేటును ఆధారంగా చేసుకుని ధరను లెక్కించుతుంది.
ప్రస్తుతం ఈ గోల్డ్ ఏటీఎం గురించి సామాజిక మాధ్యమాల్లో చర్చ నడుస్తోంది.
ఎక్స్'లో ఒక వినియోగదారుడు స్పందిస్తూ.. "వావ్! త్వరలో భారత్‌లో కూడా ఇలాంటి గోల్డ్ ఏటీఎంలను చూడాలనుంది" అని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరో నెటిజన్ సరదాగా స్పందిస్తూ - "ఇది భారత్‌కు వస్తే గొప్ప ఆవిష్కరణ అవుతుంది, కానీ చైన్ స్నాచర్లకు మాత్రం పండుగే" అంటూ హాస్యంగా వ్యాఖ్యానించారు.