Page Loader
Online Delivery: ఇక 10 నిమిషాల డెలివరీ మరింత ఖరీదు.. వివిధ రకాల అదనపు ఛార్జీలతో వినియోగదారులకు భారంగా మారుతున్న సేవలు!
వివిధ రకాల అదనపు ఛార్జీలతో వినియోగదారులకు భారంగా మారుతున్న సేవలు!

Online Delivery: ఇక 10 నిమిషాల డెలివరీ మరింత ఖరీదు.. వివిధ రకాల అదనపు ఛార్జీలతో వినియోగదారులకు భారంగా మారుతున్న సేవలు!

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 07, 2025
11:23 am

ఈ వార్తాకథనం ఏంటి

నగరాలలో ప్రజలు ఇప్పుడు కేవలం 10 నిమిషాల్లో డెలివరీ పొందుతున్న సౌకర్యాన్ని అనుభవిస్తున్నారు. ఇది ఎంతో సౌకర్యాన్ని కలిగిస్తున్నా, కొన్ని సమస్యలను కూడా కలిగిస్తోంది. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్, జెప్టో వంటి డెలివరీ యాప్‌లపై ప్రజల నమ్మకం పెరిగింది. అయితే, తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించిన నివేదిక ప్రకారం, ఈ డెలివరీ సేవలతో వినియోగదారులపై అనేక రకాల అదనపు ఛార్జీలు విధించబడుతున్నాయి. దీని వల్ల ప్రతి ఆర్డర్‌పై అదనంగా రూ. 50 వరకు వసూలవుతోంది. ఈ డబ్బు కొంతమేరకు క్యాష్‌బ్యాక్ రూపంలో తిరిగి వస్తున్నా, తుది బిల్లు ఎక్కువగానే ఉంటోందని పలువురు వినియోగదారులు అంటున్నారు.

వివరాలు 

తక్కువ ధరలకు వస్తువులు దొరకడం లేదు 

వినియోగదారులు మొదటగా "హ్యాండ్లింగ్ ఛార్జ్" చెల్లించాల్సి ఉంటుంది. ఇది ప్రతి ఆర్డర్‌కు నిర్ణయించబడుతుంది. దీనిలో రూ. 10 నుంచి రూ. 21 వరకూ వసూలవుతాయి. అంతేకాకుండా, GST, డెలివరీ ఛార్జీలు, కార్ట్ ఫీజు, వర్షం పడితే వర్షపు రుసుము, ట్రాఫిక్ అధికంగా ఉన్న సమయంలో సర్జ్ ఛార్జ్ వంటివి కూడా బిల్లో చేరుతాయి. ఫలితంగా మొత్తం ధర పెరిగిపోతుంది. ఈ పరిస్థితుల మధ్య చాలా మంది వినియోగదారులు ముందుగానే తమ షాపింగ్‌ను ప్లాన్ చేసుకోవడం ప్రారంభించారు. వారు ఆఫ్‌లైన్ ధరలతో పాటు వివిధ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ధరలను పోల్చి చూసే అలవాటు పెంచుకున్నారు. తక్కువ ధరలకు వస్తువులు దొరకడం లేదని గుర్తించి, తగినట్లే ఖర్చు చేసే దిశగా వెళ్తున్నారు.

వివరాలు 

వీధి వ్యాపారుల కంటే తక్కువ ధరలకు..

గతంలో ఈ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు స్థానిక కిరాణా దుకాణాలు, వీధి వ్యాపారుల కంటే తక్కువ ధరలకు వస్తువులను అందించేవి. కానీ ఇప్పుడు ఈ సేవలపై వసూలవుతున్న అధిక రుసుముల వల్ల ఆ ప్రయోజనం తగ్గిపోయింది. ఢిల్లీకి చెందిన వినియోగదారురాలు ఊర్వశి శర్మ మాట్లాడుతూ.. "ఇప్పుడు నేను నా దగ్గరలోని స్థానిక వ్యాపారుల వద్ద నుంచి పండ్లు, కూరగాయలు కొనుగోలు చేస్తున్నాను. అక్కడ పండ్లు రూ.30-40 వరకు తక్కువ ధరకు లభిస్తున్నాయి. కొన్ని ఆన్‌లైన్‌లో చౌకగా ఉన్నా, వాటిపై నిర్వహణ, డెలివరీ ఫీజులు కలిపితే ఆఖరికి వాటి ఖర్చు ఎక్కువగానే వస్తోంది" అన్నారు.

వివరాలు 

ఛార్జీల ట్రాకింగ్ కష్టంగా మారింది: 

ఈ ప్లాట్‌ఫారమ్‌లకు సంబంధించిన రుసుములు ఒకే విధంగా ఉండటం లేదు. ఉదాహరణకు.. స్విగ్గీ, జెప్టో: రూ.200 లేదా అంతకన్నా ఎక్కువ ఆర్డర్ చేస్తే డెలివరీ ఛార్జీ వదిలివేస్తారు. బ్లింకిట్: ఉచిత డెలివరీ పొందాలంటే కనీసం రూ.500 విలువైన ఆర్డర్ చేయాలి. హ్యాండ్లింగ్ ఛార్జీలు కూడా వేరుగా ఉన్నాయి. స్విగ్గీలో: ఆర్డర్ విలువ ఆధారంగా రూ.10-15 వసూలవుతాయి. జెప్టోలో: పెద్ద ఆర్డర్‌లకు రూ.21, చిన్నవాటికి రూ.13. బ్లింకిట్‌లో: సాధారణంగా రూ.11 వసూలవుతాయి. వాతావరణ ప్రభావంతో వచ్చే అదనపు ఛార్జీలు కూడా ఉన్నాయి. వర్షం లేదా వరద సమయంలో రూ.15 నుంచి రూ.30 వరకు అదనపు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ మొత్తం బిల్లు మొత్తాన్ని పెంచడమే కాక, వినియోగదారులను ఆలోచింపజేస్తోంది.