మళ్లీ నిరాశపరిచిన స్టాక్ మార్కెట్లు.. భారీ నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ భారీ నష్టాలతోనే ముగిశాయి. సెన్సెక్స్ సూచీ 676 పాయింట్లు, నిఫ్టీ 207 పాయింట్లు చొప్పున పతనమయ్యాయి. ఉదయం 66,064.41 పాయింట్ల వద్ద సెన్సెక్స్ నష్టాలతో ప్రారంభమైంది. ఈ మేరకు బుధవారం అధిక సమయం నష్టాల్లోనే ట్రేడ్ అయ్యింది. ఒక దశలో 1000 పాయింట్లకుపైగా నష్టపోయి 65,431.68కు దిగజారింది. సెషన్ చివరిలో కొద్దిగా కోలుకుని 676.53 పాయింట్ల నష్టానికి 65,782.78 వద్ద ట్రేడింగ్ ముగించింది. మరోవైపు నిఫ్టీ 207 పాయింట్ల మేర నష్టంతో 19,526.55 పాయింట్ల వద్ద నిలిచింది. డాలరుతో రూపాయి మారకం విలువ 82.58గా ఉండం గమనార్హం. అగ్రరాజ్యం అమెరికా రేటింగ్‌ను ఫిచ్ ఏజెన్సీ తగ్గించడంతో మదుపర్లలో నైరాశ్యం కనిపించింది.
అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ స్టాక్ మార్కెట్లు సైతం నష్టాల్లో కూరుకుపోయాయి
AAAగా ఉన్న రేటింగ్‌ను AA+కు కుదించింది. వచ్చే 3 ఏళ్లలో అగ్రదేశం ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణించనుందనే సంకేతాలను వెలువరించింది. ఈ నేపథ్యంలోనే రుణభారం పెరుగుదలను ఇందుకు కారణంగా ప్రకటించింది. ఈ మేరకు ఇన్వెష్టర్లలో ప్రతికూల ప్రభావాన్ని నింపినట్టైంది. 2011లోనూ స్టాండర్డ్ పూర్ రేటింగ్ ఏజెన్సీ అగ్రరాజ్యం రేటింగ్‌ను కుదించింది. మళ్లీ 2023లో అదే మాదిరిగా స్పందించడంతో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు నష్టాలను చవిచూశాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ స్టాక్ మార్కెట్లు సైతం నష్టాల్లో కూరుకుపోయాయి. ఫిచ్ అంచనాతో సెన్సెక్స్ ఓ దశలో భారీగా సుమారు వెయ్యి పాయింట్లకుపైగా కుదేలైంది. క్రమంగా పుంజుకుని 676 వద్ద స్థిరీకరించింది. పిచ్ రేటింగ్ ప్రభావం తాత్కాలికంగానే ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.