
Stock Market: కుదేలైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1000 పాయింట్లు డౌన్, నిఫ్టీ 24,550 దిగువకు!
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం తీవ్ర పతనాన్ని చవిచూశాయి.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ప్రతికూల పరిణామాల ప్రభావంతో కీలక సూచీలు నిఫ్టీ50, బీఎస్ఈ సెన్సెక్స్ ఘోరంగా క్షీణించాయి.
మధ్యాహ్నం 1:46 గంటల సమయంలో నిఫ్టీ50 సూచీ 289 పాయింట్ల (1.16%) నష్టంతో 24,524.75 వద్ద ట్రేడవుతుండగా, బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ 947 పాయింట్లు (1.16%) పడిపోయి 80,649.22 వద్ద కొనసాగుతోంది.
అంతకు ముందు ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 1,000 పాయింట్లకుపైగా నష్టాన్ని నమోదు చేయగా, నిఫ్టీ 24,550 పాయింట్లకు దిగువకు పడిపోయింది.
వివరాలు
0.7% మేర క్షిణించిన నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్షియల్స్ సూచీలు
ఈ క్షీణతకు ప్రధాన కారణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి ప్రధాన సంస్థలతో పాటు ఫైనాన్స్,ఐటీ రంగాల్లోని షేర్ల పతనం నిలిచింది.
ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు బీఎస్ఈలో 1.5% పడిపోయి రూ.1,406 వద్దకు చేరుకుంది.
దాదాపు అన్ని రంగాల సూచీలు నష్టాలతోనే కొనసాగాయి.నిఫ్టీ ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఫార్మా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ & గ్యాస్ రంగాలు 1% నుండి 1.5% మధ్యలో నష్టాలను చవిచూశాయి.
అలాగే నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్షియల్స్ సూచీలు సైతం సుమారు 0.7% మేర క్షీణించాయి.
విస్తృత మార్కెట్ విషయానికి వస్తే, నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 0.5% పడిపోగా, నిఫ్టీ స్మాల్‌క్యాప్ సూచీ 0.2% స్వల్ప నష్టాన్ని చవిచూసింది.
వివరాలు
పతనానికి ప్రధానంగా మూడు అంతర్జాతీయ అంశాలు కారణం
మార్కెట్‌లో ఈ పతనంతో బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ సుమారు రూ.2.6 లక్షల కోట్ల మేర తగ్గి, రూ.438.56 లక్షల కోట్లకు చేరిందని ఓ నివేదిక పేర్కొంది.
ఈ తీవ్ర పతనానికి ప్రధానంగా మూడు అంతర్జాతీయ అంశాలు కారణమయ్యాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు: 1. అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ పెరుగుదల
అమెరికాలో దీర్ఘకాలిక ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ గత 18 నెలలలో అత్యధిక స్థాయికి చేరాయి.
30 ఏళ్ల ట్రెజరీ బాండ్ ఈల్డ్ 5%కి పైగా ఉండగా, పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్‌ల నుండి బాండ్ మార్కెట్‌లకు నిధులను తరలిస్తున్నారు.
ఈ పరిణామం భారత వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.
వివరాలు
2. అమెరికా ఆర్థిక లోటుపై ఆందోళనలు
గత శుక్రవారం మూడీస్ సంస్థ అమెరికా క్రెడిట్ రేటింగ్‌పై ప్రతికూల వ్యాఖ్యలు చేయడం, దేశానికి ఉన్న భారీ రుణ బాధ్యతలను హైలైట్ చేయడం మార్కెట్లను కుదిపేసింది.
ఈ వారం అమెరికా పార్లమెంట్‌లో ఓటింగ్‌కు రానున్న పన్నుల చట్టం ద్వారా ప్రభుత్వం ఇప్పటికే ఉన్న 36 ట్రిలియన్ డాలర్ల రుణ భారం పైగా మరో 3.8 ట్రిలియన్ డాలర్ల రుణం తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
"అమెరికాలో అధికమైన ఆర్థిక లోటు ప్రధాన సమస్య. దీని వల్ల మార్కెట్లలో స్థిరత్వం కరువవుతోంది," అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ డా. వీకే విజయకుమార్ తెలిపారు.
వివరాలు
3. యూఎస్ బాండ్ల వేలంపై మిశ్రమ స్పందన
బుధవారం జరిగిన 20 ఏళ్ల గల 16 బిలియన్ డాలర్ల అమెరికన్ బాండ్ వేలానికి పెట్టుబడిదారుల నుంచి ఆశించినంతగా స్పందన రాకపోవడం కూడా మార్కెట్లను ప్రభావితం చేసింది.
ఇది అమెరికా ఆస్తులపై పెట్టుబడిదారుల విశ్వాసం తగ్గుతున్న సంకేతంగా పరిగణించబడుతోంది. ఈ కారణంగా బాండ్ ఈల్డ్స్ మరింత పెరిగాయని నిపుణులు పేర్కొన్నారు.
"5, 10, 30 ఏళ్ల బాండ్లలో ఈల్డ్స్ పెరగడముతోపాటు బలహీన బాండ్ వేలం ఫలితాలు అమెరికా ట్రెజరీలపై పెట్టుబడిదారుల నమ్మకం తగ్గుతోందని సూచిస్తున్నాయి," అని డా. విజయకుమార్ అన్నారు.
వివరాలు
భారీగా పతనమైన అమెరికా స్టాక్ మార్కెట్లు
ఈ అన్ని పరిణామాల ప్రభావం ఆసియా మార్కెట్లపైనా కనిపించింది.
ఎంఎస్‌సీఐ ఆసియా-పసిఫిక్ సూచీ (జపాన్ మినహా) 0.5% మేర పడిపోయింది.
జపాన్ నిక్కీ సూచీ 0.7%, చైనా సూచీలు 0.2%, హాంగ్‌కాంగ్ హ్యాంగ్‌సెంగ్ సూచీ 0.8% మేర నష్టాలను చవిచూశాయి.
అంతకుముందు ట్రేడింగ్ సెషన్‌లో అమెరికా స్టాక్ మార్కెట్లు కూడా భారీగా పతనమైన విషయం తెలిసిందే.