Page Loader
Stock market: భారీ నష్టాలలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 25 వేల దిగువకు నిఫ్టీ
భారీ నష్టాలలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 25 వేల దిగువకు నిఫ్టీ

Stock market: భారీ నష్టాలలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 25 వేల దిగువకు నిఫ్టీ

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 18, 2025
04:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఈ వారం భారీ నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్‌ రంగ షేర్లలో భారీగా అమ్మకాలు జరగడం మార్కెట్‌పై ప్రభావాన్ని చూపింది. యాక్సిస్‌ బ్యాంక్‌ త్రైమాసిక ఫలితాలలో నికర లాభం తగ్గడం పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి నమోదై సూచీలను కిందకు లాగాయి. అంతేకాక బలహీన త్రైమాసిక ఫలితాలు, అంతర్జాతీయ మార్కెట్ల అనిశ్చితి కూడా మార్కెట్‌పై ప్రభావం చూపింది. ఈ ప్రభావంతో సెన్సెక్స్‌ 500 పాయింట్లకు పైగా పతనమవగా, నిఫ్టీ కీలకమైన 25వేల స్థాయిని కోల్పోయింది.

వివరాలు 

భారీ నష్టాలను నమోదు చేసిన సెన్సెక్స్‌ 30 సూచీ

ఉదయం సెన్సెక్స్‌ 82,193.62 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాలతో ట్రేడింగ్‌ ప్రారంభించింది (మునుపటి ముగింపు 82,259.24). అనంతరం నష్టాలు పెరిగాయి. ట్రేడింగ్‌ మధ్యలో ఒక దశలో 81,608.13 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. చివరికి సెన్సెక్స్‌ 501.51 పాయింట్లు కోల్పోయి 81,757.73 వద్ద ముగిసింది. నిఫ్టీ 143.05 పాయింట్ల నష్టంతో 24,968.40 వద్ద స్థిరమైంది. రూపాయి మారకం విలువ డాలరుతో పోల్చితే 86.16గా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో యాక్సిస్‌ బ్యాంక్‌, బీ ఇ ఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు భారీ నష్టాలను నమోదుచేశాయి. అదే సమయంలో బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా స్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు లాభాలు నమోదు చేశాయి.

వివరాలు 

మార్కెట్ పతనానికి కారణాలు: 

అంతర్జాతీయంగా బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 70.16 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ధర ఔన్సుకు 3,355 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మే, జూన్‌ నెలల్లో దేశీయ మార్కెట్లకు మద్దతుగా నిలిచిన విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) జూలైలో అమ్మకాల వైపు మళ్లారు. మే నెలలో రూ.19,860 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసిన ఎఫ్‌ఐఐలు, జూన్‌లో రూ.14,590 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. అయితే జూలై నెలలో ఇప్పటి వరకు రూ.2,660 కోట్ల షేర్లను అమ్మారు. ఇది మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది.

వివరాలు 

మార్కెట్ పతనానికి కారణాలు: 

యాక్సిస్‌ బ్యాంక్‌ నికర లాభం 3 శాతం తగ్గినట్టు నిన్న వెల్లడైంది. ఈ సమాచారం వెలువడిన తర్వాత ఆ బ్యాంక్‌ షేర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇంట్రాడేలో 6 శాతం మేర నష్టపోయిన యాక్సిస్‌ బ్యాంక్‌ షేరు చివరికి బీఎస్‌ఈలో 5.24 శాతం నష్టంతో రూ.1,099 వద్ద ముగిసింది.యాక్సిస్‌ బ్యాంక్‌ నెగటివ్‌ ఎఫెక్ట్‌ ఇతర బ్యాంకింగ్‌ షేర్లపైనా పడింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లలో కూడా అమ్మకాలు జరగడంతో మార్కెట్‌ మరింత బలహీనమైంది. అంతర్జాతీయంగా అమెరికాతో ట్రేడ్‌ డీల్‌పై స్పష్టత లేకపోవడం,అంతర్జాతీయ ముడి చమురు ధరలు మళ్లీ 70 డాలర్ల స్థాయికి చేరుకోవడం వంటి అంశాలు కూడా దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలపై ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి.