
Stock Market: మూడోరోజూ లాభాల్లో స్టాక్ మార్కెట్.. నిఫ్టీ 22,900 దాటింది
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజూ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వచ్చినప్పటికీ, కనిష్ఠ స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు మార్కెట్లను నిలబెట్టింది.
ముఖ్యంగా ఫైనాన్షియల్ స్టాక్స్, అధిక వెయిటేజీ ఉన్న షేర్లలో కొనుగోళ్లు మార్కెట్‌కు కలిసి వచ్చాయి. అయితే, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
ఇవి మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ స్మాల్‌క్యాప్, నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీలు 2 శాతం మేర రాణించాయి.
సెన్సెక్స్ 75,473.17 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 75,301.26) లాభాలతో ప్రారంభమైంది. ట్రేడింగ్‌లో మొదటి నుంచే లాభదాయక ఒరవడి కొనసాగింది.
Details
నష్టాల్లో టెక్ మహీంద్రా
ఇంట్రాడేలో 75,568.38 వద్ద గరిష్ఠ స్థాయిని తాకిన సూచీ, చివరకు 147.79 పాయింట్ల లాభంతో 75,449.05 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 73.30 పాయింట్లు పెరిగి 22,907.05 వద్ద స్థిరపడింది.
డాలరుతో రూపాయి మారకం విలువ 86.44గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, జొమాటో, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు మంచి లాభాలను సాధించాయి.
అయితే టెక్ మహీంద్రా, టీసీఎస్, ఐటీసీ, ఇన్ఫోసిస్, సన్‌ఫార్మా షేర్లు నష్టాల్లో ముగిశాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 70 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు 3037 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.