
Stock market: మూడో రోజూ భారీ లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. 25,400 ఎగువకు నిఫ్టీ
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ లాభాల్లోనే ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించిన తాజా నిర్ణయం పెట్టుబడిదారుల నమ్మకాన్ని పెంచగా, ఇటీవల అమలులోకి వచ్చిన జీఎస్టీ మార్పులు, అమెరికా-భారత్ వాణిజ్య చర్చలు కూడా సానుకూల వాతావరణాన్ని తీసుకొచ్చాయి. ముఖ్యంగా ఔషధం, ఆరోగ్యరంగ షేర్లతో పాటు బ్యాంకింగ్, ఐటీ, ఆటోమొబైల్, ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్ బలంగా రాణించాయి. ఫలితంగా నిఫ్టీ 25,400 స్థాయిని అధిగమించింది. రోజు ఆరంభంలో సెన్సెక్స్ 83,108.92 వద్ద (మునుపటి ముగింపు 82,693.71) లాభాల్లో ట్రేడింగ్ మొదలుపెట్టింది. రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో సూచీ కనిష్ఠంగా 82,704.92, గరిష్టంగా 83,141.21 వద్ద కదలాడింది. చివరకు 320.25 పాయింట్లు లాభపడుతూ 83,013.96 వద్ద సెటిల్ అయింది.
వివరాలు
బ్రెంట్ క్రూడ్ చమురు ధర బ్యారెల్‌కు 67.46 డాలర్లు
మరోవైపు నిఫ్టీ 74.90 పాయింట్లు జమచేసి 25,405.15 వద్ద స్థిరపడింది. విదేశీ మారకంలో రూపాయి డాలర్‌తో పోలిస్తే 28 పైసలు బలహీనపడి 88.13 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో భాగమైన 30 ప్రధాన షేర్లలో ఎటెర్నల్, సన్‌ఫార్మా, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వంటివి లాభాలను నమోదు చేశాయి. అయితే టాటా మోటార్స్, ట్రెంట్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్ వంటి షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ చమురు ధర బ్యారెల్‌కు 67.46 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు ధర 3,665.49 డాలర్ల వద్ద నిలిచింది.