Stock Market : బేర్ పట్టు నుంచి కాస్త విరామం .. స్వల్ప లాభాలలో స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ 22,959
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విధానాలు వాణిజ్య యుద్ధాలకు దారితీస్తాయనే భయంతో ప్రపంచ మార్కెట్లు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి.
వరుసగా ఎనిమిది రోజుల పాటు భారీ నష్టాలను చవిచూసిన దేశీయ మార్కెట్లు సోమవారం కాస్త ఉపశమనాన్ని పొందాయి.
అయితే, స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం కూడా నష్టాలతోనే ప్రారంభమయ్యాయి.
కానీ చివరి గంటల్లో నష్టాల నుంచి బయటపడుతూ లాభాలతో రోజును ముగించాయి.
ముఖ్యంగా గత కొద్దిరోజులుగా తీవ్రమైన నష్టాలను ఎదుర్కొన్న మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ కొంత కోలుకున్నాయి.9
వివరాలు
సెన్సెక్స్, నిఫ్టీ సూచీల కదలికలు:
గత శుక్రవారం మార్కెట్ ముగింపు (75,939)తో పోలిస్తే, సోమవారం ఉదయం సెన్సెక్స్ దాదాపు 300 పాయింట్లు నష్టంతో ప్రారంభమైంది.
అనంతరం మరింత దిగజారి, 600 పాయింట్లకు పైగా కోల్పోయి 75,294 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది.
అయితే, మధ్యాహ్నం తర్వాత కొంత కోలుకున్న సెన్సెక్స్ చివరికి 57 పాయింట్ల స్వల్ప లాభంతో 75,996 వద్ద స్థిరపడింది.
ఇదే విధంగా నిఫ్టీ కూడా ఉదయం 22,750కు దిగజారి, చివరకు 30 పాయింట్ల స్వల్ప లాభంతో 22,959 వద్ద ముగిసింది.
వివరాలు
లాభాలు, నష్టాలు:
సెన్సెక్స్‌లో మనప్పురం ఫైనాన్స్, సీజీ పవర్, అశోక్ లేలాండ్, ఆస్ట్రాల్ లిమిటెడ్ షేర్లు లాభాలను నమోదు చేశాయి.
మరోవైపు, పీబీ ఫిన్‌టెక్, మహీంద్రా అండ్ మహీంద్రా, సుప్రీమ్ ఇండస్ట్రీస్, వరుణ్ బేవరేజెస్ షేర్లు నష్టపోయాయి.
నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 195 పాయింట్లు లాభపడగా, బ్యాంక్ నిఫ్టీ 159 పాయింట్ల లాభంతో ముగిసింది. అంతర్జాతీయ మారకంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 86.88గా నమోదైంది.