
Stock market: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. ₹10 లక్షల కోట్లు ఆవిరి
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల ప్రభావంతో మార్కెట్లు పతనమయ్యాయి.
ట్రంప్ విధించిన సుంకాల (టారిఫ్‌లు) కారణంగా వాణిజ్య యుద్ధ భయాలు పెరిగి, అమెరికా మార్కెట్లతో పాటు ఆసియా మార్కెట్లను కూడా ప్రభావితం చేశాయి.
ముఖ్యంగా మెటల్, ఐటీ, ఫార్మా స్టాక్స్‌లో భారీ అమ్మకాలు చోటుచేసుకున్నాయి.
ఈ అమ్మకాలు ఒత్తిడితో సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా కోల్పోయింది, నిఫ్టీ మళ్లీ 23,000 దిగువకు చేరుకుంది.
బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ దాదాపు ₹10 లక్షల కోట్ల మేర తగ్గి ₹403 లక్షల కోట్లకు చేరుకుంది.
వివరాలు
బ్యాంక్ షేర్లు లాభాల్లో
ఈ ఉదయం,సెన్సెక్స్ 76,160.09 పాయింట్ల వద్ద ప్రారంభమైంది (మునుపటి ముగింపు 76,295.36).
అయితే, మార్కెట్ రోజంతా నష్టాల్లో కొనసాగింది. ఇంట్రాడేలో 75,240.55 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకిన తర్వాత, చివరకు 930.67పాయింట్ల నష్టంతో 75,364.69 వద్ద ముగిసింది.
నిఫ్టీ కూడా 345.65 పాయింట్ల నష్టంతో 22,904వద్ద స్థిరపడింది. రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే ₹85.22 గా ఉంది.
సెన్సెక్స్‌లో ప్రధానంగా టాటా స్టీల్, టాటా మోటార్స్, ఎల్ అండ్ టీ,అదానీ పోర్ట్స్,ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు తీవ్రంగా నష్టపోయాయి.
అయితే, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్,నెస్లే ఇండియా,ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
అంతర్జాతీయంగా,బ్రెంట్ క్రూడ్ ధర భారీగా పడిపోయి బ్యారెల్‌కు $67.15 వద్ద ట్రేడవుతుండగా, బంగారం ఔన్సు $3118 వద్ద ఉంది.
వివరాలు
మార్కెట్ పతనానికి కారణాలు
1.వాణిజ్య యుద్ధ భయాలు: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత్ సహా పలు దేశాల దిగుమతులపై సుంకాలు విధించడంతో వాణిజ్య యుద్ధ భయం పెరిగింది. ఇప్పటికే కెనడా పై టారిఫ్‌లు అమల్లోకి రాగా, చైనా, యూరోపియన్ యూనియన్ దేశాలు ప్రతీకార చర్యలకు సిద్ధమవుతున్నాయి. ఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయని, భారత్ మార్కెట్‌పై కూడా దీని ప్రభావం ఉంటుందని పెట్టుబడిదారులు ఆందోళన చెందారు.
2.మాంద్యం భయాలు: ప్రతీకార సుంకాల ప్రభావంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.నిన్నటి ట్రేడింగ్ సెషన్‌లో అమెరికా మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూశాయి.ముఖ్యమైన సూచీలు తీవ్రంగా పడిపోవడంతో $2.3 ట్రిలియన్ మార్కెట్ విలువ ఆవిరైంది. దీనివల్ల మన దేశ ఐటీ స్టాక్స్ పతనమయ్యాయి.
వివరాలు
మార్కెట్ పతనానికి కారణాలు
3. ఫార్మా రంగం: భారత్‌పై సుంకాలు విధించినప్పటికీ, ఫార్మా రంగాన్ని మినహాయించడంతో నిన్నటి ట్రేడింగ్ సెషన్‌లో ఫార్మా స్టాక్స్ బలంగా నిలిచాయి. కానీ, వెంటనే ట్రంప్ తన ప్రకటనను మార్చి, ఫార్మా రంగంపై కూడా భారీ టారిఫ్‌లు విధించనున్నట్లు ప్రకటించడంతో అరబిందో ఫార్మా, లారస్ ల్యాబ్స్, లుపిన్ వంటి కంపెనీల షేర్లు పడిపోయాయి.
4. అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు: ఫైనాన్షియల్,ఎఫ్‌ఎంసీజీ షేర్లను మినహాయించి,మిగిలిన అన్ని రంగాలలో అమ్మకాలు భారీగా పెరిగాయి.ముఖ్యంగా నిఫ్టీ మెటల్ (-6%),నిఫ్టీ ఫార్మా (-4%), ఐటీ, ఆటో,రియాల్టీ,ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్, టాటా స్టీల్ షేర్ల అమ్మకాల కారణంగా సూచీలపై ప్రతికూల ప్రభావం పడింది.