STOCK MARKETS : సూచీలకు 'అమెరికా ఫెడ్' జోష్..రూ.4లక్షల కోట్లకు చేరిన మదుపర్ల సంపద
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. ఈ మేరకు సెన్సెక్స్ 929 పాయింట్లు, నిఫ్టీ 256 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. అమెరికా ఫెడ్ తీసుకున్న నిర్ణయం సూచీలకు నూతనోత్సాహాన్ని అందించింది. ఈ క్రమంలోనే వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించడం, భవిష్యత్‌లో రేట్ల తగ్గింపు ఉంటుందని సంకేతాలు ఇవ్వడం లాంటివి భారీ లాభాలకు బాటలు వేసింది. ప్రధానంగా ఐటీ(IT), రియల్టీ షేర్ల(Realty Shares)లో కొనుగోళ్లకు మద్దతు లభించింది. ఫలితంగా సూచీలు సెన్సెక్స్(Sensex), నిఫ్టీ(Nifty) సరికొత్త జీవన కాల గరిష్ఠాలను నమోదు చేశాయి.
900 పాయింట్లకుపైగా సెన్సెక్స్ జోరు
స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 900 పాయింట్లకుపైగా లాభపడగా నిఫ్టీ 21,150 పాయింట్ల ఎగువస్థాయిలో నిలిచింది. మదుపరుల సంపదగా భావించే BSEలో నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ సుమారుగా రూ.4 లక్షల కోట్లకు పెరిగి మొత్తంగా రూ. 355 లక్షల కోట్లకు ఎగబాకింది. గురువారం ఉదయం ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాలతో సెన్సెక్స్ 70,146 పాయింట్ల వద్ద భారీ లాభాలతో ప్రారంభమైంది. ఆసాంతం సూచీలు లాభాల్లోనే కొనసాగడం విశేషం. ఇంట్రాడేలో 70,110.75- 70,602.89 మధ్య కదలాడింది. చివరకు 929.60 పాయింట్ల లాభంతో 70,514.20 వద్ద ముగిసింది.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్పిందంేటే
నిఫ్టీ సైతం 256.35 పాయింట్ల లాభంతో 21,182.70 వద్ద స్థిరపడింది.డాలరుతో రూపాయి మారకం విలువ 83.33గా ఉంది. అంతర్జాతీయంగా క్రూడ్ ధర 75.63 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యింది. ఔన్సు బంగారం ధర 2049 డాలర్లకు చేరుకుంది. ద్రవ్యోల్బణం కట్టడికి రేట్లు పెంచుతూ వచ్చిన అమెరికా ఫెడరల్ రిజర్వ్ తాజాగా కీలక రేట్లలో మార్పులేమీ చేయలేదు. ఇక ద్రవ్యోల్బణం 2 శాతం లక్ష్యం కంటే ఎక్కువే ఉన్న కారణంగా కఠిన వైఖరిని కొనసాగిస్తోంది. ఈ మేరకు విధాన రేట్లను ప్రస్తుతం 5.25-5.50 శాతం శ్రేణిలోనే ఉంచుతున్నట్లు వివరించింది. వరుసగా మూడోసారీ రేట్లను ఇదే స్థాయిలో కొనసాగించింది. 2024లో 3విడతల్లో వడ్డీ రేట్లలో కోత ఉండొచ్చన్న సంకేతాలను మాత్రం ఇచ్చింది.ఫలితంగా మార్కెట్లో జోష్ సంతరించుకుంది.