Page Loader
Stock Market: 200 పాయింట్లకు పైగా నష్టాల్లో సెన్సెక్స్.. 23,500 మార్క్‌ను కోల్పోయిన నిఫ్టీ 
200 పాయింట్లకు పైగా నష్టాల్లో సెన్సెక్స్.. 23,500 మార్క్‌ను కోల్పోయిన నిఫ్టీ

Stock Market: 200 పాయింట్లకు పైగా నష్టాల్లో సెన్సెక్స్.. 23,500 మార్క్‌ను కోల్పోయిన నిఫ్టీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 18, 2024
10:02 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు సోమవారం మిశ్రమంగా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల స్తబ్ధత, దేశీ కార్పొరేట్‌ సంస్థల ఆర్థిక ఫలితాలు నిరుత్సాహకరంగా ఉన్నప్పటికీ, విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితులు దేశీయ మదుపర్లను అప్రమత్తంగా ఉంచుతున్నాయి, దాంతో సూచీలు ఒత్తిడిలో ఉన్నాయి. ఈ క్రమంలో, సెన్సెక్స్‌ 200 పాయింట్ల పైన నష్టాన్ని నమోదు చేస్తూ 77,356 వద్ద ట్రేడ్‌ అవుతోంది, అలాగే నిఫ్టీ 23,500 మార్క్‌ను కోల్పోయింది. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో, సెన్సెక్స్‌ 223 పాయింట్లు తగ్గి 77,356 వద్ద, నిఫ్టీ 46 పాయింట్లు నష్టపోయి 23,486 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 7 పైసలు పెరిగి 84.39గా ఉంది.

వివరాలు 

భారీ నష్టాలతో ముగిసిన అమెరికా మార్కెట్లు 

రంగాల వారీగా, ఐటీ రంగ సూచీ దాదాపు 0.8% నష్టాలు కంటూ కొనసాగుతోంది. అయితే, లోహ, రియల్టీ రంగాలు 1.3% లాభాల్లో నిలిచాయి. ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టెక్‌ మహీంద్రా షేర్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అమెరికా మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ముగిశాయి.ట్రంప్‌ తన కార్యవర్గం కోసం చేస్తున్న నియామకాలపై మదుపర్ల ప్రతికూల స్పందన నేపథ్యంలో,వడ్డీ రేట్ల కోత నెమ్మదించొచ్చని ఆందోళనలు పెరిగాయి. ఈ కారణంగా,ఎస్‌ అండ్‌ పీ 500, నాస్‌డాక్‌ సూచీలు సుమారు 2% నష్టపోయాయి. ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు సోమవారం మిశ్రమంగా కదలాడుతున్నాయి. జపాన్‌ నిక్కీ 0.72% నష్టంతో, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ 0.02% నష్టంతో ఉంటే, దక్షిణ కొరియా కోస్పి, హాంగ్‌కాంగ్‌ హాంగ్‌సెంగ్‌ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి.