Swiggy: త్వరలో స్విగ్గీ IPO.. $600 మిలియన్లను సేకరించే యోచన
స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు శుభవార్త. ప్రతి నెల మదుపర్లకు ఓ ఐపీఓ (ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్) మంచి లాభాలను అందిస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ ఫుడ్ టెక్ కంపెనీ స్విగ్గీ తన IPO పరిమాణాన్ని పెంచడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం కంపెనీ IPO ద్వారా రూ. 5,000 కోట్ల కొత్త షేర్లను విక్రయించాలనుకుంటోంది, ఇంతకుముందు ఇది రూ. 3,750 కోట్లుగా ఉండేది. ఇప్పుడు దీనిని రూ. 1,250 కోట్ల వరకు పెంచనుంది. ఈ నిర్ణయం అభివృద్ధి చెందుతున్న మార్కెట్లో పోటీలో స్విగ్గీ తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడంలో భాగంగా తీసుకున్నదని తెలుస్తోంది.
లక్ష్యం ఎంత?
స్విగ్గీ మొదటిసారిగా IPO ద్వారా సుమారు రూ. 10,400 కోట్ల (సుమారు $1.25 బిలియన్) సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో రూ. 3,750 కోట్లు కొత్త షేర్ల విక్రయం, మరో రూ. 6,664 కోట్లు ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా రావాల్సి ఉంది. అయితే, అక్టోబరు 3న జరగబోయే సర్వసభ్య సమావేశంలో (EGM) బోర్డు కొత్త ప్రతిపాదనను ఆమోదిస్తే, IPO పరిమాణం $1.4 బిలియన్లకు పెరుగుతుంది. ఈ మార్పులపై స్విగ్గీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఆదాయంలో వృద్ధి
2024 ఆర్థిక సంవత్సరంలో స్విగ్గీ ఆదాయం 36 శాతం పెరిగి రూ. 11,247 కోట్లకు చేరుకుంది, ఇది 2023లో రూ. 8,265 కోట్లు మాత్రమే. అదే సమయంలో, స్విగ్గీ తన నష్టాలను 44 శాతం తగ్గించుకుంది, 2023లో రూ. 4,179 కోట్ల నుంచి 2024లో రూ. 2,350 కోట్లకు తగ్గాయి. కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా ఈ నష్టాల తగ్గింపుకు కారణమైంది.
పెరుగుతున్న పోటీ
ప్రస్తుతం స్విగ్గీ జొమాటో, బ్లింకిట్ వంటి ప్రధాన ప్రత్యర్థులతో పోటీపడుతోంది. ఏప్రిల్‌లో స్విగ్గీ తన డ్రాఫ్ట్ IPO పత్రాలను దాఖలు చేయగా, జొమాటో, బ్లింకిట్ తమ లాభాలను మెరుగుపరుచుకోవడం ప్రారంభించాయి. జప్టో వంటి కొత్త స్టార్టప్‌లు కూడా భారీగా నిధులు సేకరించాయి, దీంతో మార్కెట్ పోటీ మరింత తీవ్రమైంది. అంతేకాకుండా, వాల్‌మార్ట్ ఫ్లిప్‌కార్ట్ కూడా క్విక్ కామర్స్ విభాగంలోకి ప్రవేశించడం పోటీని మరింత ఉధృతం చేసింది.