Page Loader
Tata Capital: టాటా క్యాపిటల్‌ ఐపీఓకు కంపెనీ బోర్డు ఆమోదం 
టాటా క్యాపిటల్‌ ఐపీఓకు కంపెనీ బోర్డు ఆమోదం

Tata Capital: టాటా క్యాపిటల్‌ ఐపీఓకు కంపెనీ బోర్డు ఆమోదం 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 25, 2025
02:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాటా గ్రూప్‌కు చెందిన టాటా క్యాపిటల్‌ (Tata Capital) పబ్లిక్‌ ఇష్యూ ప్రణాళికకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. టాటా టెక్నాలజీస్‌ బంపర్‌ లిస్టింగ్‌ తర్వాత ఈ గ్రూప్‌ నుంచి మార్కెట్లోకి రానున్న మరో సంస్థ కావడంతో మదుపర్లలో ఆసక్తి పెరిగింది. టాటా క్యాపిటల్‌ ఐపీఓ వస్తుందన్న వార్తలు చాలా కాలంగా ప్రచారంలో ఉన్నప్పటికీ, దీనిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. అయితే తాజాగా బోర్డు ఆమోదంతో ఐపీఓ రాక ఖరారైంది. టాటా క్యాపిటల్‌ రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.1,504 కోట్లు సమీకరించాలని బోర్డు నిర్ణయించింది. మొత్తం 23 కోట్ల తాజా షేర్లను ఇష్యూ చేయనుంది. అయితే, ఐపీఓకి సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

వివరాలు 

రాణించిన టాటా ఇన్వెస్ట్‌మెంట్‌ షేర్లు

2007లో స్థాపించబడిన టాటా క్యాపిటల్‌ గృహ రుణాల నుంచి వ్యక్తిగత రుణాల వరకు వివిధ రకాల రుణ సేవలను అందిస్తోంది. బోర్డు అంగీకారం ప్రకటించిన నేపథ్యంలో టాటా ఇన్వెస్ట్‌మెంట్‌ షేర్లు 8% మేర పెరిగాయి. ఉదయం 11:50 సమయానికి టాటా ఇన్వెస్ట్‌మెంట్‌ షేర్లు 7.95% లాభంతో రూ.6,212 వద్ద ట్రేడవుతున్నాయి. టాటా క్యాపిటల్‌ను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (NBFC) సంస్థగా గుర్తించింది. ఆర్‌ బి ఐ నిబంధనల ప్రకారం, ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు తమ షేర్లను మూడు సంవత్సరాల లోపు మార్కెట్లో లిస్ట్‌ చేయడం తప్పనిసరి.

వివరాలు 

టాటా సన్స్‌ 93% వాటా

అంటే, 2025 సెప్టెంబర్‌లోపు టాటా క్యాపిటల్‌ షేర్లు స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంతోనే టాటా క్యాపిటల్‌ ఐపీఓకి బోర్డు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం టాటా క్యాపిటల్‌లో టాటా సన్స్‌ 93% వాటాను కలిగి ఉంది. అలాగే, టాటా ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌లో టాటా సన్స్‌కు 68.51% వాటా ఉంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత, 2023లో టాటా గ్రూప్‌ టాటా టెక్నాలజీస్‌ ఐపీఓను ప్రవేశపెట్టింది. ఇది ఊహించినట్లుగానే బంపర్‌ లిస్టింగ్‌ను సాధించింది. ఇప్పుడు, టాటా గ్రూప్‌ నుంచి మార్కెట్లోకి వస్తున్న మరో సంస్థ టాటా క్యాపిటల్‌.