Modi regime: 'మధ్యతరగతిపై పన్ను తగ్గిన భారం'.. మోదీ పాలనలో 5 రెట్లు పెరిగిన రూ.50 లక్షల ఆదాయం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పది ఏళ్ల పరిపాలన కాలంలో రూ.20 లక్షల కన్నా తక్కువ ఆదాయం కలిగిన మధ్య తరగతి వర్గంపై పన్ను భారం తగ్గింది. అదే సమయంలో,రూ.50 లక్షలకు పైగా ఆదాయం ఉన్న వారు చెల్లించే పన్ను మొత్తంలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్) దాఖల వివరాల ప్రకారం, రూ.50 లక్షలకు మించిన ఆదాయం ఉన్న వారి సంఖ్య 2013-14లో 1.85 లక్షలుగా ఉండగా, 2023-24 నాటికి అది 9.39 లక్షలకు చేరుకుంది. వీరు చెల్లిస్తున్న పన్ను మొత్తం 2014లో రూ.2.52 లక్షల కోట్ల నుంచి 2024 నాటికి 3.2 రెట్లు పెరిగి రూ.9.62 లక్షల కోట్లకు చేరింది.
భారీగా పెరిగిన రిటర్నుల సంఖ్య
ఆదాయపు పన్ను ద్వారా సమకూరుతున్నమొత్తం 76 శాతం రూ.50 లక్షలకు పైగా ఆదాయం ఉన్న వారి నుంచే వస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇది మధ్య తరగతి వర్గాలపై పన్ను భారం తగ్గిందని సూచిస్తోంది. అదే విధంగా,రూ.2.5 లక్షల నుంచి రూ.7 లక్షల మధ్య ఆదాయం కలిగిన వారు చెల్లించే సగటు ఆదాయపు పన్ను 2023-24లో సుమారు రూ.43,000 ఉంది. ఇది వారి ఆదాయంలో 4-5శాతం మాత్రమే. అధికారిక లెక్కల ప్రకారం, రూ.10-20 లక్షల ఆదాయం ఉన్న వారిపై పన్ను భారం గత పది సంవత్సరాల్లో దాదాపు 60 శాతం తగ్గింది. 2013-14లో వ్యక్తుల ఆదాయపు పన్ను రిటర్నుల సంఖ్య 3.60 కోట్లుగా ఉండగా, 2023-24 నాటికి అది 7.97 కోట్లకు చేరుకుంది.