బడ్జెట్ 2023లో పన్ను తగ్గింపులు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ 2023పై వేతన జీవులు, చిన్న, మధ్య, భారీ పారిశ్రామిక వర్గాలతో పాటు పేదలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2024లో సార్వత్రిక ఎన్నికలకు దృష్టిలో పెట్టుకొన్ని పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. పన్ను తగ్గింపులు, పరిశ్రమలకు ప్రోత్సహాకాలు, సామాజిక భద్రత, తయారీ, ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఈ కేంద్రం ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించవచ్చు.
ఆదాయపు పన్ను స్లాబ్‌లను సర్దుబాటు?
ఎన్నికల ఏడాది కావడంతో పేద, మధ్యతరగతి ప్రజల అభివృద్ధికి బడ్జెట్లో ఆశాజన కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. గ్రామీణ స్థాయిలో ఉద్యోగాలు కల్పనకోసం ఈ కేంద్రం ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించవచ్చు. అలాగే, వేతన జీవులు ఎప్పటి నుంచి డిమాండ్ చేస్తున్న ఆదాయపు పన్ను స్లాబ్‌లను సర్దుబాటు చేయవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాంఘిక సంక్షేమం వంటి కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల జేబుల్లోకి మరింత సొమ్మును చేర్చాలని ఉద్దేశంతో కేంద్రం బడ్జెట్‌ను రూపొందించినట్లు సమాచారం. అయితే దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని పెంచే అవకాశం ఉంది. ఇందులో ఎక్కువగా ప్రైవేట్ జెట్, హెలికాప్టర్లు, అత్యాధునిక ఎలక్ట్రానిక్ వస్తువులు ఉండనున్నట్లు సమాచారం.