Tech Mahindra: టెక్ మహీంద్రా Q2 నికర లాభంలో 153% వృద్ధి పెరిగి రూ.1,250 కోట్లుగా నమోదు
ప్రముఖ ఐటీ సంస్థ టెక్ మహీంద్రా (Tech Mahindra) రెండో త్రైమాసిక ఫలితాలను శనివారం ప్రకటించింది. ఈ త్రైమాసికంలో లాభాల్లో భారీగా పెరుగుదల నమోదు చేసింది. సెప్టెంబర్ ముగిసిన త్రైమాసికంలో టెక్ మహీంద్రా ఏకీకృత నికర లాభం 153.1 శాతం పెరిగి రూ. 1,250 కోట్లకు చేరింది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 493.9 కోట్లుగా ఉండేది. టెక్ మహీంద్రా తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపిన వివరాల ప్రకారం, ఆదాయం కూడా పెరిగింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 13,313.2 కోట్లుగా నమోదైంది, గత ఏడాది ఇదే సమయంలో రూ. 12,863.9 కోట్ల ఆదాయం ఉండగా, ఈ సారి 3.49 శాతం వృద్ధి నమోదైంది.
పుణె ప్రధాన కార్యాలయంలో కొత్తగా 6,653 ఉద్యోగుల నియామకం
అదేవిధంగా, టెక్ మహీంద్రా తన షేర్ హోల్డర్లకు మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. అర్హులైన షేర్ హోల్డర్లకు ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 15 చొప్పున డివిడెండ్ చెల్లించనున్నట్లు బోర్డు నిర్ణయించింది, అయితే దీని రికార్డు తేదీని ఇంకా ప్రకటించలేదు. తర్వాతి త్రైమాసికంలో కూడా వృద్ధి కొనసాగుతుందన్న విశ్వాసాన్ని కంపెనీ సీఈఓ మోహిత్ జోషి వ్యక్తం చేశారు. టెక్ మహీంద్రా పుణె ప్రధాన కార్యాలయంలో కొత్తగా 6,653 ఉద్యోగులను నియమించడంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,54,273కు చేరింది. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి కంపెనీ షేరు విలువ బీఎస్‌ఈలో 0.68 శాతం తగ్గి రూ. 1,688 వద్ద ముగిసింది.