Zomato: జొమాటో ఉద్యోగులకు అదిరే సర్‌ప్రైజ్.. 330 కోట్ల షేర్ల కేటాయింపు!
ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తమ ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ తమ ఉద్యోగులకు 12 మిలియన్ల స్టాక్‌లు కేటాయించనున్నట్లు ప్రకటించింది. ఎంప్లాయీ స్టాక్ ఓనర్‌షిప్ (ESOPs) కింద, 1,19,97,768 షేర్లను కేటాయించేందుకు ఇటీవల ఆమోదం పొందినట్లు జొమాటో తన ఎక్స్చేంజీ ఫైలింగ్‌లో స్పష్టం చేసింది. ఈ షేర్ల విలువ సుమారు రూ.330.17 కోట్లుగా ఉంటుందని తెలిపారు. ఈ మొత్తం షేర్లలో 1,19,97,652 షేర్లు 2021 ఈఎస్ఓపీ స్కీమ్ నుండి అందుతాయి. మిగతా 116 షేర్లు ఫుడ్డీ బే ఈఎస్ఓసీ 2014 స్కీమ్ కింద ఉద్యోగులకు కేటాయిస్తారని కంపెనీ పేర్కొంది.
ఐపీఓకు సిద్ధమవుతున్న స్విగ్గీ
ఉద్యోగులకు కేటాయించిన ఈ షేర్లు ఎలాంటి లాకిన్ పీరియడ్ ప్రక్రియలకు లోబడి ఉండదని తెలిపింది. ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ అనేది ఉద్యోగులకు కంపెనీ స్టాక్ రూపంలో అందించే ఈ నిర్ణయం ద్వారా కంపెనీ తన మార్కెట్ విలువ, పని తీరు పై నిబద్ధతను నిరూపించుకుంటోంది. ఈ స్టాక్ ఆప్షన్స్‌కు ముఖ విలువ రూ.1గా ఉంది. బెంగళూరుకు చెందిన మరో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ పబ్లిక్ ఇష్యూకు వస్తున్న నేపథ్యంలో జొమాటో ఈ స్టాక్ ఆప్షన్స్ నిర్ణయాన్ని తీసుకుంది. స్విగ్గీ, రూ.5000 కోట్లు సమీకరించే లక్ష్యంతో ఐపీఓకు సిద్ధమవుతోంది.
జొమాటో షేరు ధర 2.38 శాతం
మరోవైపు, అక్టోబర్ 4వ తేదీన జొమాటో షేరు ధర 2.38 శాతం పెరిగి రూ.275.20 వద్ద ముగిసింది. ముందుగా స్టాక్ ఆప్షన్స్ గురించి ఎక్స్చేంజీలకు వెల్లడించిన తరువాత షేరు ధర కొద్దిగా తగ్గింది. కానీ ఆ తర్వాత పుంజుకుంది. సోమవారం రోజున కూడా ఈ స్టాక్ పాజిటివ్ ట్రెండ్‌ను కొనసాగించే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.