Stock Market Crash: స్టాక్ మార్కెట్ లో భారీ పతనం.. సెన్సెక్స్ 1,300, నిఫ్టీ 400 పాయింట్లకు పైగా పతనం
ఈరోజు (సోమవారం) స్టాక్ మార్కెట్‌లో అకస్మాత్తుగా పెద్ద స్థాయిలో క్షీణత చోటుచేసుకుంది. ట్రేడింగ్ ప్రారంభంలోనే మార్కెట్ తీవ్ర ఒత్తిడికి గురైంది.ఈ క్రమంలో సెన్సెక్స్, నిఫ్టీ రెండింటిలో కూడా భారీ పతనం నమోదయ్యింది. సెన్సెక్స్ 79,713.14 వద్ద ప్రారంభమై, 1,100 పాయింట్లు పడిపోయి 78,620 వద్ద ట్రేడవుతోంది.నిఫ్టీ కూడా సోమవారం 24,315.75 పాయింట్ల వద్ద ప్రారంభమై,370 పాయింట్లు క్షీణించి 23,930 వద్ద ట్రేడవుతోంది. బిఎస్‌ఈ సెన్సెక్స్‌లోని టాప్ 30 స్టాక్‌లలో 25 స్టాక్‌లు భారీ క్షీణతతో ట్రేడవుతుండగా, 4 స్టాక్‌లు మాత్రమే పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లలో అత్యధికంగా 2.39 శాతం పెరుగుదల కనబడింది, అయితే సన్ ఫార్మా షేర్లలో 3 శాతం క్షీణత నమోదైంది.
అన్ని రంగాల్లో కూడా భారీ క్షీణత
దేశంలోని అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు కూడా 2.64 శాతం పడిపోయాయి. నేడు అన్ని రంగాల్లో కూడా భారీ క్షీణత కొనసాగుతోంది. మీడియా రంగంలో 2.66 శాతం, చమురు మరియు గ్యాస్ రంగంలో 2.47 శాతం క్షీణత ఉందని తెలుస్తోంది. అలాగే, ఫైనాన్స్, ఆటో, బ్యాంకింగ్ రంగాలలో కూడా తీవ్ర క్షీణత కనిపిస్తోంది. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు.
బ్లూ స్టార్ 5 శాతం వరకు నష్టం
పెద్ద స్టాక్‌ల క్షీణతను పరిశీలిస్తే.. ఆర్‌ఐఎల్, అడానీ పోర్ట్, సన్‌ఫార్మా, టాటా మోటార్స్ వంటి హెవీవెయిట్ స్టాక్‌లు 3 శాతం వరకు నష్టాన్ని చవిచూస్తున్నాయి. ఇండియన్ ఆయిల్ షేర్లు 5 శాతం, బజాజ్ ఆటో షేర్లు 4.3 శాతం, హీరో మోటోకార్ప్ షేర్లు 3.8 శాతం వరకు పడిపోయాయి. అలాగే, హిందుస్తాన్ జింక్ 4 శాతం, హెచ్‌పిసిఎల్ షేర్లు 3.82 శాతం, పివిఆర్ 6 శాతం, చెన్నై పెట్రో కార్ప్ 5.49 శాతం, బ్లూ స్టార్ 5 శాతం వరకు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి.