Toyota: జపాన్‌లో టయోటా 'టెస్ట్ సిటీ'.. భవిష్యత్తు టెక్నాలజీకి నూతన వేదిక
ఈ వార్తాకథనం ఏంటి
ఆటో మొబైల్ దిగ్గజం టయోటా జపాన్‌లో అద్భుతంగా ఒక 'టెస్ట్ సిటీ' నిర్మిస్తోంది.
ఇందులో రోబోలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)యంత్రాలు, అటానమస్ వాహనాల వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం పరీక్షించే అవకాశం ఉంటుంది.
ఈ ప్రాజెక్టు కోసం టయోటా 10 బిలియన్ డాలర్లు(సుమారు రూ.87,000 కోట్లు) వెచ్చిస్తోంది. మౌంట్ ఫుజీ సమీపంలోని వూవెన్ సిటీ వద్ద దీన్ని అభివృద్ధి చేస్తోంది.
ఈ టెస్ట్ సిటీ 47,000 చదరపు మీటర్ల విస్తీర్ణంతో మొదటి దశను ఇప్పటికే పూర్తి చేసింది. మొత్తం పూర్తయ్యే సరికి 2.94 లక్షల చదరపు మీటర్ల ప్రాంగణంగా అభివృద్ధి చేయనున్నారు.
ప్రాజెక్టు ఇన్‌ఛార్జి దైసుకే టయోదా ప్రకారం ఇది మొబిలిటీ వాహనాలు, యంత్రాలను పరీక్షించే ప్రదేశం మాత్రమే, స్మార్ట్ సిటీ కాదు.
Details
గూగుల్ ప్రయత్నించినా.. విజయవంతం కాలేదు
ఈ ప్రాంతంలో గతంలో టయోటా ఆటో ప్లాంట్ ఉండేది. ప్రస్తుత టెస్ట్ సిటీ పరిశోధకులు, అంకుర సంస్థల వ్యవస్థాపకులకు ప్రయోగశాల మాదిరిగా ఉపయోగపడనుందని టయోదా తెలిపారు.
భవిష్యత్తు నగరాలను అభివృద్ధి చేసేందుకు గతంలో గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సహా మరికొన్ని సంస్థలు ప్రయత్నించాయి.
కానీ కెనడాలోని టొరంటోలో 'ఫ్యూచర్ సిటీ' నిర్మించేందుకు ఆల్ఫాబెట్ చేసిన ప్రయత్నాలు కార్యరూపం దాల్చలేదు.
ఇదే విధంగా సౌదీలోని నియోమ్, అమెరికాలో శాన్‌ఫ్రాన్సిస్కో, అబుధాబి విమానాశ్రయం వద్ద ఇటువంటి ప్రాజెక్టులు చేపట్టాలనుకున్నా, అవి అమలు కాలేదు.
Details
హైడ్రోజన్ వాహనాలపైనే టయోటా దృష్టి
టయోటా 2021లో ఈ టెస్ట్ సిటీ నిర్మాణాన్ని ప్రారంభించింది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి భవనాలన్నింటికీ భూగర్భ మార్గాలు ఉంటాయి. ఈ మార్గాల్లో అటానమస్ వాహనాలు వస్తువులను సరఫరా చేస్తాయి.
అయితే ఇక్కడ విద్యుత్తు వాహనాల ప్రభావం తక్కువగా ఉండటం ఆసక్తికర అంశం. ప్రస్తుతం నగరంలో 100 మందికి మాత్రమే నివసించే అనుమతి ఉంది.
కానీ ఇంకా ఎవరూ నివాసం ఉండడం లేదు. టెస్లా, బీవైడీ విద్యుత్తు వాహనాల మార్కెట్‌లో దూసుకుపోతుండగా, టయోటా మాత్రం హైడ్రోజన్ వాహనాలపై ప్రయోగాలు చేస్తోంది.
అదే సమయంలో రోబోటిక్స్‌పై టయోటా ప్రత్యేక దృష్టి సారిస్తోంది. గూగుల్ అనుబంధ సంస్థ వయమోను ప్రధాన పోటీదారుగా టయోటా భావిస్తున్నదని ఆటో పరిశ్రమ విశ్లేషకుడు కైసుకే కొనిషి తెలిపారు.