
Trump: అమెరికాలో మందుల ధరల తగ్గింపుకు మార్గం: ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో మందుల ధరలు తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ ధరలను తగ్గించేందుకు అనుకూలంగా ఉండే విధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు.
ఈ ఉత్తర్వు ప్రకారం, అమెరికాలో ప్రిస్క్రిప్షన్ మందుల ధరలు గణనీయంగా, అంటే సుమారుగా 59 శాతం వరకు తగ్గించాల్సిన అవసరం ఫార్మా కంపెనీలపై పడనుంది.
ట్రంప్ ప్రకటనల ప్రకారం,ఇతర దేశాల్లో విక్రయించే తక్కువ ధరలనే ఇప్పుడు అమెరికాలోనూ అమలులోకి తేనున్నామని తెలిపారు.
దీని వల్ల మందుల ధరలు 30శాతం నుంచి 80శాతం వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇందుకోసం అమెరికా ప్రభుత్వం "మోస్ట్ ఫేవర్డ్ నేషన్" విధానాన్ని అమలు చేయనున్నట్టు ట్రంప్ స్పష్టం చేశారు.
వివరాలు
33 బిలియన్ డాలర్ల విలువైన మందులు కొనుగోలు
ఈ విధానం వల్ల గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో తక్కువ ధరలకు మందులు అమెరికాలో లభించనున్నాయని ఆయన తెలిపారు.
అయితే, ఈ విధానం అన్ని మందులకూ వర్తించదు. ఇది ప్రధానంగా "మెడికేర్ పార్ట్ B" కార్యక్రమానికి సంబంధించిన మందులపైనే వర్తించనుంది.
ఈ మెడికేర్ కార్యక్రమం కింద 2021లో అంచనా ప్రకారం 33 బిలియన్ డాలర్ల విలువైన మందులు కొనుగోలు చేయబడ్డాయి.
వివరాలు
అమెరికాలో 7 కోట్ల మంది మెడికేర్ లబ్ధిదారులు
అమెరికాలో సుమారు 7 కోట్ల మంది వృద్ధులకు మెడికేర్ ద్వారా ఆరోగ్య బీమా అందుతోంది.
అయితే, ఇప్పటి వరకు వృద్ధులు అత్యధిక ధరలకే మందులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
దీంతో, ట్రంప్ ప్రవేశపెడుతున్న కొత్త విధానాన్ని ఫార్మా కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకించే అవకాశముందని భావిస్తున్నారు.
ట్రంప్ గతంలో తన అధ్యక్ష పదవీకాలం చివరిదశలో కూడా ఇలాంటి ఆర్డర్‌ను తీసుకువచ్చారు. కానీ అప్పట్లో కోర్టులు ఆ ఉత్తర్వులను నిలిపివేశాయి.
వివరాలు
ఇతర దేశాల ప్రకారం ఎలా?
మందుల ధరలను అమెరికాలో నిర్ణయించే విషయంలో ఇతర దేశాల ధరలను ప్రమాణంగా తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇతర దేశాలకు నిర్ణయాధికారాన్ని పరోక్షంగా అప్పగించడమేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఫార్మా కంపెనీల వాదన ప్రకారం, ధరలు తగ్గితే లాభాలు పడిపోయి, తద్వారా పరిశోధన, అభివృద్ధిపై పెట్టుబడులు పెట్టడం కష్టమవుతుందని చెబుతున్నారు.
ఇది కొత్త మందుల ఆవిష్కరణకు అడ్డంకిగా మారుతుందని పేర్కొంటున్నారు.
వివరాలు
ట్రంప్ వాదన ఇదీ
ట్రంప్ మాత్రం, కంపెనీలు 30 రోజుల్లోగా ప్రభుత్వంతో ధరల తగ్గింపు ఒప్పందం చేసుకోవాలని, 6 నెలల్లోగా ధరలను తగ్గించాలని స్పష్టంగా పేర్కొన్నారు.
"మందుల ధరలు తక్కువగా ఉంటే పరిశోధనలు జరగవని ఫార్మా కంపెనీలు చెబుతున్నాయి. అలా అయితే అమెరికన్లు మాత్రం ఎందుకు పరిశోధన ఖర్చులు భరించాలి?" అని ప్రశ్నించారు. ఈ పరిస్థితిని తప్పకుండా మార్చుతామన్న ధీమాను వ్యక్తం చేశారు.
వివరాలు
భారత్ వంటి దేశాల్లో ధరల పెరుగుదల?
జీటీఆర్ (గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్) వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ అభిప్రాయం ప్రకారం, ట్రంప్ విధానం అమలులోకి వస్తే భారత్ సహా అనేక దేశాల్లో మందుల ధరలు పెరిగే అవకాశం ఉందన్నారు.
అమెరికాలో మందుల ధరలు తగ్గితే, ఆ నష్టాన్ని ఇతర దేశాల్లో ధరలు పెంచి భర్తీ చేసుకునేందుకు ఫార్మా కంపెనీలు ప్రయత్నిస్తాయని చెప్పారు.
అందువల్ల భారత్ వంటి దేశాలు స్పష్టమైన విధానంతో ముందుకు సాగాలని సూచించారు.
వివరాలు
భారత వైద్యంలో ట్రిప్స్ ప్రభావం
భారతదేశం డబ్ల్యూటీఓ, ట్రిప్స్ (ట్రేడ్ రిలేటెడ్ యాస్పెక్ట్స్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్) నిబంధనలను పాటిస్తోంది.
అయితే ట్రిప్స్-ప్లస్ విధానాలు, అదనపు పేటెంట్ రక్షణ వంటి అంశాలను మాత్రం అమలు చేయడం లేదు.
డేటా ఎక్స్‌క్లూజివిటీ, పేటెంట్ గడువు పొడిగింపు, స్వల్ప మార్పులతో కొత్త పేటెంట్ల పొందడం వంటి వ్యవహారాలను భారత్ వ్యతిరేకిస్తోంది.
దీని ఫలితంగా జనరిక్ ఔషధాల్లో భారత్ అనూహ్యమైన అభివృద్ధిని సాధించింది.
వివరాలు
హెచ్‌ఐవీ, క్యాన్సర్ వంటి వ్యాధులకు అవసరమైన ఔషధాలు తక్కువ ధరలో
హెచ్‌ఐవీ, క్యాన్సర్ వంటి వ్యాధులకు అవసరమైన ఔషధాలను తక్కువ ధరలో అందించగలగడం భారత్‌కు సాధ్యమైంది.
ట్రంప్ తీసుకువచ్చిన విధానాలు అమెరికాలో మందుల ధరలు తగ్గించగలిగినా, ఇతర దేశాల్లో, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ధరలు పెరిగే అవకాశాన్ని కలిగిస్తాయని ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థకు చెందిన టాక్స్ పార్టనర్ సౌరభ్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు.