
Trump Tariff: భారత్‌పై 25 శాతం సుంకాలు విధించిన డొనాల్డ్ ట్రంప్.. రొయ్య, జౌళి సహా ఈ ఎగుమతులపై ప్రభావం!
ఈ వార్తాకథనం ఏంటి
భారత్- అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊహించని విధంగా భారత్‌కు గట్టి షాక్ ఇచ్చారు. భారత్ నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే ఉత్పత్తులపై 25 శాతం దిగుమతి సుంకాలు విధించనున్నట్లు ఆయన ప్రకటించారు. అంతేగాక, అదనంగా పెనాల్టీలను కూడా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కొత్త సుంకాలు 2025 ఆగస్టు 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయని తెలిపారు. ఈ నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వివరాలు
GDPలో 0.2 శాతం నుంచి 0.5శాతం మేర తగ్గుదల వచ్చే అవకాశం
భారత స్థూల దేశీయోత్పత్తి (GDP)లో 0.2 శాతం నుంచి 0.5శాతం మేర తగ్గుదల వచ్చే అవకాశం ఉందని, దాదాపు 30 బిలియన్ డాలర్లు అంటే సుమారుగా రూ.2.60లక్షల కోట్ల మేర నష్టంగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ సుంకాల విషయంలో ఇండోనేషియా,వియత్నాం వంటి దేశాల కంటే భారత్‌పైనే ఎక్కువ భారం మోపుతున్నట్లు సమాచారం. ట్రంప్ ప్రకటించిన సుంకాల పెంపుతో భారత్‌కు చెందిన ఉక్కు,అల్యూమినియం, వాహన విడిభాగాలు, సముద్ర ఆహార ఉత్పత్తులు (ప్రత్యేకంగా రొయ్యలు), జౌళి ఉత్పత్తులు,రత్నాభరణాలు,స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు,ఇతర ఆహార పదార్థాల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం తలెత్తనుంది. ముఖ్యంగా అమెరికాకు భారత్ నుంచి 10 బిలియన్ డాలర్ల విలువైన రత్నాభరణాలు ఎగుమతవుతుండగా,వాటిపై గణనీయమైన నష్టం వస్తుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వివరాలు
భారత్-బ్రిటన్ మధ్య వాణిజ్య ఒప్పందం
భారత సముద్ర ఆహార ఉత్పత్తులపై కూడా గట్టి ప్రభావం ఉండొచ్చని వ్యవసాయ ఆర్థిక నిపుణుడు అశోక్ గులాటి హెచ్చరిస్తున్నారు. 10 నుంచి 15 శాతం వరకు సుంకాలు ఉంటాయనుకోవడం సాధారణమే కానీ, అంతకు మించి సుంకాలను విధించడం నిరాశకు గురిచేసిందన్నారు. ఇక ఇటీవల భారత్-బ్రిటన్ మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందంతో జౌళి పరిశ్రమకు లాభాలు చేకూరినప్పటికీ, అమెరికా నిర్ణయంపై ప్రతికూల ప్రభావం పడవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఇండోనేషియాపై అమెరికా 20 శాతం సుంకాలు,వియత్నాంపై 19 శాతం టారిఫ్‌లు విధిస్తున్నప్పటికీ,భారత్‌పై ఎక్కువ శాతం విధించడం వల్ల పోటీదారులుగా ఈ దేశాల నుంచి ఎగుమతులు పెరిగే అవకాశం ఉందని ఫిక్కీ అధ్యక్షుడు హర్షవర్ధన్ అగర్వాల్ పేర్కొన్నారు.
వివరాలు
2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అమెరికా భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి
అలాగే, భారత్ రష్యా నుంచి మిలటరీ సామగ్రి, క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకే అదనపు పెనాల్టీలను విధిస్తున్నట్లు ట్రంప్ వ్యాఖ్యానించడంతో ఆయా రంగాల్లో పనిచేస్తున్న సంస్థల్లో గందరగోళం నెలకొందని ఫియో డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ తెలిపారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరితే మాత్రమే ఈ అనిశ్చితి తొలగి స్థిరత్వం వస్తుందని స్పష్టంచేశారు. అత్యుత్తమంగా, 2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అమెరికా భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది. ఈ త్రైమాసికంలో భారత్ ఎగుమతులు 22.18 శాతం పెరిగి 25.51 బిలియన్ డాలర్లకు చేరాయి.
వివరాలు
దిగుమతులు 11.68 శాతం పెరిగి 12.86 బిలియన్ డాలర్లుగా నమోదు
అదే సమయంలో దిగుమతులు 11.68 శాతం పెరిగి 12.86 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గత సంవత్సరం 2024లో అమెరికాకు భారత్ ఎగుమతి చేసిన ప్రధాన వస్తువుల్లో ఔషధ ఫార్ములేషన్లు 8.1 బిలియన్ డాలర్లు, టెలికాం సామగ్రి 6.5 బిలియన్ డాలర్లు, రత్నాలు 5.3 బిలియన్ డాలర్లు, పెట్రోలియం ఉత్పత్తులు 4.1 బిలియన్ డాలర్లు, వాహనాలు, విడిభాగాలు 2.8 బిలియన్ డాలర్లు, బంగారం సహా ఇతర ఆభరణాలు 3.2 బిలియన్ డాలర్లు, రెడీమేడ్ దుస్తులు, ఇనుము, ఉక్కు కలిపి 5.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.