
Trump's 50% tariffs: ట్రంప్ టారిఫ్ షాక్.. ప్రమాదంలో 3 లక్షల భారతీయుల ఉద్యోగాలు.!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ ఉత్పత్తులపై 50 శాతం వరకు అదనపు సుంకాలు విధించడంతో, ఇండియాలో లక్షలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా యూఎస్ మార్కెట్‌పై ఆధారపడే ఎగుమతి రంగాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. కొందరు నిపుణుల అంచనా ప్రకారం త్వరలోనే దేశంలో ఉద్యోగ సంక్షోభం తలెత్తవచ్చని హెచ్చరిస్తుండగా, మరికొందరు మాత్రం దేశీయ డిమాండ్‌ను పెంచడం, కొత్త దేశాలకు ఎగుమతులు మళ్లించడం ద్వారా అమెరికా టారిఫ్‌ల ప్రభావాన్ని తగ్గించవచ్చని చెబుతున్నారు.
వివరాలు
నష్టపోనున్న విభాగాలు ఇవే..
జీనియస్ హెచ్‌ఆర్ టెక్ ఎండీ ఆర్.పీ. యాదవ్ మాట్లాడుతూ,"ఇటీవల అమెరికా అమలు చేస్తున్న టారిఫ్‌లు ఉద్యోగరంగంపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. ప్రత్యేకంగా అమెరికా మార్కెట్‌పై ఆధారపడిన పరిశ్రమలు ఎక్కువగా దెబ్బతింటాయి"అని తెలిపారు. టెక్స్టైల్,ఆటో విడిభాగాలు,వ్యవసాయం,రత్నాలు,ఆభరణాల రంగాలు అత్యంత నష్టపోనున్న విభాగాలుగా ఆయన పేర్కొన్నారు. సూక్ష్మ,చిన్న,మధ్య తరహా సంస్థలు (MSMEలు)ఈ ఒత్తిడిని బలంగా ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఒక్క టెక్స్టైల్ రంగంలోనే లక్ష ఉద్యోగాలు ప్రమాదంలో పడవచ్చని యాదవ్ అంచనా వేశారు. మొత్తం మీద 2-3 లక్షల ఉద్యోగాలు ఈ టారిఫ్‌ల వలన పోతాయని ఆయన పేర్కొన్నారు. సూరత్,ముంబైలోని సీపిజ్ ఎకనామిక్ జోన్‌లో పనిచేస్తున్న రత్నాలు,ఆభరణాల యూనిట్లలో డిమాండ్ తగ్గడం, ఖర్చులు పెరగడం వలన వేలాది ఉద్యోగాలు ముప్పులో పడతాయని ఆయన స్పష్టం చేశారు.
వివరాలు
అమెరికా డిమాండ్ లేకపోతే.. లోకల్ మార్కెట్ బలం
మరోవైపు టీమ్‌లీజ్ సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బాలసుబ్రహ్మణ్యన్ అనంత నారాయణన్ మాత్రం భిన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. "భారత ఆర్థిక వ్యవస్థ చైనా లాగే ఎగుమతులపై కాకుండా, ప్రధానంగా దేశీయ వినియోగంపై ఆధారపడి ఉంది. అందువల్ల టారిఫ్‌ల ప్రభావం అంతగా ఉండదు. ప్రస్తుతం ఉద్యోగ నష్టం లేదా ఆర్థిక మందగమనం కనిపించడం లేదు. మన పరిశ్రమలు ఎక్కువగా దేశీయ డిమాండ్‌ను తీర్చడంలోనే ఉన్నాయి" అని అన్నారు. అమెరికాకు భారత ఎగుమతులు సుమారు 87 బిలియన్ డాలర్ల మేర ఉండగా, ఇది జీడీపీలో కేవలం 2.2 శాతం మాత్రమేనని ఆయన గుర్తుచేశారు.
వివరాలు
అమెరికా డిమాండ్ లేకపోతే.. లోకల్ మార్కెట్ బలం
ఫార్మా, ఎలక్ట్రానిక్స్ రంగాలు ఈ ప్రభావం నుండి దాదాపు రక్షించబడతాయని తెలిపారు. ఈ టారిఫ్‌లు నెలాఖరులో అమల్లోకి వస్తాయి, అప్పటి వరకు కొన్ని చర్చలు జరగవచ్చని చెప్పారు. అంతేకాదు, యూకేతో ఇండియా ఇప్పటికే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA) కుదుర్చుకుంది. ఇతర దేశాలతో కూడా వాణిజ్య ఒప్పందాలు జరుగుతున్నాయి. కాబట్టి అమెరికా టారిఫ్‌లు అమల్లోకి వచ్చినా, ఇతర మార్కెట్లను ఆశ్రయించి నష్టాన్ని తగ్గించవచ్చని అనంత నారాయణన్ విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తగ్గడం, వినియోగం మందగించడం,టారిఫ్‌లపై అనిశ్చితి, జియోపాలిటికల్ సంఘర్షణలు ఉద్యోగావకాశాల వృద్ధిని ప్రభావితం చేస్తున్నాయని ఆయన గుర్తుచేశారు.
వివరాలు
రాబోయే క్వార్టర్ వరకు అనిశ్చితి
సియల్ హెచ్‌ఆర్ ఎండీ ఆదిత్య మిశ్రా మాట్లాడుతూ, "అమెరికా టారిఫ్‌ల వలన కొన్ని రంగాలకు నష్టం తప్పదని" అన్నారు. ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్, ఆభరణాలు, ఆటో విడిభాగాలు, లెదర్, షూస్, రొయ్యలు, ఇంజనీరింగ్ ఉత్పత్తులు వంటి రంగాలు అమెరికా మార్కెట్‌పై ఆధారపడుతున్నాయి కాబట్టి వీటిలో ఉద్యోగ నష్టం కనిపించే అవకాశముందని వివరించారు. ఫార్మాస్యూటికల్స్ రంగం నేరుగా టారిఫ్‌లకు సంబంధం లేకున్నా,రసాయనాలు,ముడి పదార్థాల ఖర్చులు పెరగడం వలన పరోక్ష ప్రభావం ఉంటుందని మిశ్రా పేర్కొన్నారు. ఈ అనిశ్చితి డిసెంబర్ క్వార్టర్ వరకు కొనసాగవచ్చని ఆయన అంచనా వేశారు. ఇప్పటికే అనేక కంపెనీలు ఖర్చులు తగ్గించే చర్యలు చేపట్టాయి. ఉత్పత్తి సరళీకరణ,నియామకాల నిలిపివేత మొదలైనవి జరుగుతున్నాయి.
వివరాలు
ఐటీ రంగంపైనా దెబ్బ
తాత్కాలిక, కాంట్రాక్ట్ ఉద్యోగాలపై వెంటనే ఒత్తిడి పడుతుందని, ముఖ్యంగా MSME రంగంలో ఇది తీవ్రమని ఆయన హెచ్చరించారు. ఐటీ రంగం, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (GCCలు) పై కూడా ఈ టారిఫ్‌ల ప్రభావం తప్పదని నిపుణులు చెబుతున్నారు. ఐటీ రంగం ఇప్పటికే మందగమనంలో ఉంది. అనేక కంపెనీలు నియామకాలు నిలిపివేశాయి. టారిఫ్‌లతో ఈ నియామకాలు మరింత తగ్గే ప్రమాదం ఉంది. జీసీసీలు కూడా కొత్త పెట్టుబడులు, ఉద్యోగ నియామకాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తాయని అంచనా. టారిఫ్ పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే అమెరికా మార్కెట్లో భారత వాటా తగ్గిపోవచ్చని, దాని ప్రభావం ఎగుమతిదారులపై, వాటికి సంబంధించిన పరిశ్రమలపై పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.