
Trump: ఫార్మాపై ట్రంప్ టార్గెట్? దిగుమతులపై పన్నుల భారమా!
ఈ వార్తాకథనం ఏంటి
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన అమెరికా మరోసారి దిగుమతులపై కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతోంది.
ఇప్పటికే సుమారు 60కి పైగా దేశాల నుండి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధించిన ఆయన, ఇప్పటివరకు పన్నుల నుంచి మినహాయించిన ఫార్మా రంగంపైనా కన్నేశారన్నది తాజా సంకేతం.
'ఔషధాలపై పన్నులు వేస్తారా?' అనే ప్రశ్నకు ఆయన "అవును, వేస్తాం" అని స్పష్టంగా ప్రకటించిన విషయం తెలిసిందే. భారతదేశం - అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యంలో భారతదేశానికి మిగులు ఉండగా, అమెరికాకు లోటు ఉంది.
ఈ లోటులో పెద్ద శాతం ఫార్మా రంగానిదే. భారత్ ఏటా దాదాపు 9 బిలియన్ డాలర్ల విలువైన మందులను అమెరికాకు ఎగుమతి చేస్తోంది.
Details
భారత్‌కు తలుపులు తెరుచుకున్నాయా?
ఔషధ ఉత్పత్తుల్లో భారత్, చైనా ప్రపంచంలో ముందున్న దేశాలే. తుది ఔషధాల్లో భారత్ అగ్రగామి కాగా, ఏపీఐ, బయోలాజిక్స్ రంగాల్లో చైనా ప్రాధాన్యం కలిగి ఉంది.
అమెరికా ఈ రెండు దేశాల నుంచే విస్తృతంగా మందులు దిగుమతి చేసుకుంటోంది. అయితే చైనాపై ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే భారీగా పన్నులు విధించగా, భారత్ సహా ఇతర దేశాలకు మాత్రం 90 రోజుల మినహాయింపు ఇచ్చింది.
ఈ సమయంలో భారత్ తన స్థాయిని బలోపేతం చేసుకోవచ్చని అంతర్జాతీయ వ్యాపార నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
చైనాకు కలిగే నష్టం మనదేశానికి లాభంగా మారే అవకాశముందని ఫార్మా రంగంలోని ప్రముఖులు విశ్లేషిస్తున్నారు.
Details
అమెరికాలో 90శాతం మందికి జనరిక్ ఔషధాలే ఆధారం
అమెరికాలో ప్రజల్లో సుమారు 90 శాతం మంది తక్కువ ధరల జనరిక్ మందులపైనే ఆధారపడుతున్నారు.
బ్రాండెడ్ ఔషధాల కంటే తక్కువ ఖర్చుతో లభించే జనరిక్ ఔషధాలు, బయోసిమిలర్స్, ఏపీఐలు భారత్ నుండి పెద్దఎత్తున ఎగుమతి అవుతున్నాయి.
అయితే ట్రంప్ సర్కారు 25 శాతం దిగుమతి సుంకం విధిస్తే, అక్కడ మందుల ధరలు ఒక్కసారిగా 12-13 శాతం పెరిగిపోతాయని అంచనాలు.
దాంతో అమెరికా ప్రజలకు ఏడాదికి సుమారు 51 బిలియన్ డాలర్ల అదనపు భారం పడే అవకాశం ఉందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.
Details
పరిశ్రమలకు నష్టమే
2023లో అమెరికా 203 బిలియన్ డాలర్ల విలువైన మందులను దిగుమతి చేసుకుంది.
బ్రాండెడ్ ఔషధాల అత్యధిక భాగం ఐర్లాండ్, జర్మనీ, స్విట్జర్లాండ్ వంటి యూరోపియన్ దేశాల నుంచి దిగుమతి అవుతోంది.
ఈ ప్రభావంతో అమెరికాలోని ప్రముఖ ఔషధ కంపెనీల సమాఖ్య 'ఫార్మా' (Pharmaceutical Research and Manufacturers of America). ఇందులో ఫైజర్, ఎలీ లిల్లీ, ఆమ్‌జెన్, బీఎంఎస్ లాంటి దిగ్గజ సంస్థలు సభ్యులుగా ఉన్నాయి.
మందులపై అదనపు పన్నులను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది పరిశ్రమకు, ప్రజలకు నష్టమేనని ఆ సంస్థ హెచ్చరిస్తోంది.
Details
ఒప్పందం అనివార్యం.. రెండు దేశాలకు మేలు
అమెరికా-భారత్ మధ్య ప్రత్యేక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారానే ఇరు దేశాల ప్రయోజనాలు రక్షించబడతాయని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ముఖ్యంగా ఔషధ రంగానికి మినహాయింపులు, తక్కువ పన్నులు లాంటి రాయితీలు ఉంటేనే జనరిక్ ఔషధాల ఎగుమతులు కొనసాగించగలమన్నది పరిశ్రమ భావన.
లేకపోతే భారత్ నుండి అమెరికాకు ఎగుమతులు తగ్గిపోవడం తధ్యం.
ఫలితంగా భారతీయ ఫార్మా సంస్థలు ఇతర దేశాల మార్కెట్లపై దృష్టి కేంద్రీకరించవలసిన పరిస్థితి తలెత్తనుంది. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఈ మార్గాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
మొత్తంగా చెప్పాలంటే ట్రంప్ వాణిజ్య విధానాలు భారత ఫార్మా రంగానికి ఒక విధంగా సవాల్ అయినప్పటికీ, చైనాపై విధించిన చర్యల నేపథ్యంలో భారత్‌కి ఇది ఒక అరుదైన అవకాశంగా మారే ఛాన్స్ కూడా ఉంది.