
Online Gaming Bill: ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర కేబినెట్ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమై, అనేక కీలక నిర్ణయాలను ఆమోదించింది. ఆన్‌లైన్ గేమింగ్‌పై నియంత్రణ కోసం తీసుకురాబోయే కొత్త బిల్లుకు కేంద్రమంత్రివర్గం అనుమతిచ్చింది. ఈ బిల్లును త్వరలో లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా ఆన్‌లైన్ మోసాలు పెరుగుతూ ఉండటంతో, వీటికి ప్రమోషన్ ఇచ్చే సెలబ్రిటీలపై దర్యాప్తు జరుగుతున్న పరిస్థితిలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త ఆన్‌లైన్ గేమింగ్ బిల్లులో,ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌పై జరిమానాలు విధించడం, కఠిన నిబంధనలు ప్రవేశపెట్టడం, అలాగే వీటికి ప్రమోషన్ ఇచ్చే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం వంటి అంశాలను రూల్స్‌లో సెట్ చేస్తున్నారు.
వివరాలు
బెట్టింగ్ యాప్స్‌పై 40 శాతం జీఎస్‌టీ
ముఖ్యంగా ఈ యాప్స్‌పై 40 శాతం జీఎస్‌టీ విధించే అవకాశముంది. 2023 అక్టోబర్‌లో బెట్టింగ్ యాప్స్‌పై 28 శాతం జీఎస్‌టీ విధించబడిన తర్వాత, 2024-25 ఆర్థిక సంవత్సరంలో 30 శాతం పన్ను విధించబడుతున్నది. అంతేకాక, గుర్తింపు పొందని అక్రమ సైట్లను బ్లాక్ చేసే అధికారం దర్యాప్తు సంస్థలకు అప్పగించారు. ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుతో పాటు,రాజస్థాన్‌లోని కోటా వద్ద కొత్త విమానాశ్రయం నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం ఇచ్చింది. ఈ నిర్ణయాల విషయాన్ని కేంద్ర మంత్రీ అశ్విని వైష్ణవ్ మీడియాకు వివరించారు. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి రూ. 1507 కోట్ల నిధులు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అందజేస్తుందని ఆయన తెలిపారు.
వివరాలు
భువనేశ్వర్‌లో రూ. 8307 కోట్ల వ్యయంతో 6 లేన్‌ల క్యాపిటల్ రీజియన్ రింగ్ రోడ్
ఈ విమానాశ్రయం నిర్మాణం ప్రాంతీయ కనెక్టివిటీని పెంచడం మాత్రమే కాక, స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా గణనీయమైన ప్రోత్సాహం ఇస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా, ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో రూ. 8307 కోట్ల వ్యయంతో 6 లేన్‌ల క్యాపిటల్ రీజియన్ రింగ్ రోడ్ నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కటక్, భువనేశ్వర్, ఖోర్దా ప్రాంతాల నుంచి వాణిజ్య వాహన రద్దీని మరలించడంతో ఒడిశా, ఇతర తూర్పు రాష్ట్రాలకు ప్రయోజనం లభించే అవకాశం ఉంది. 5,000 ఏళ్ల చరిత్ర కలిగిన కటక్‌తో పాటు నూతన రాజధానిగా అభివృద్ధి చెందిన భువనేశ్వర్ ఈ ప్రాజెక్ట్ ద్వారా గణనీయ లాభాలను పొందుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.