Page Loader
Ashwini Vaishnav: తొలి స్వదేశీ చిప్‌పై కేంద్ర మంత్రి కీలక ప్రకటన.. ఈ ఏడాదిలోనే విడుదల : అశ్వినీ వైష్ణవ్
తొలి స్వదేశీ చిప్‌పై కేంద్ర మంత్రి కీలక ప్రకటన.. ఈ ఏడాదిలోనే విడుదల : అశ్వినీ వైష్ణవ్

Ashwini Vaishnav: తొలి స్వదేశీ చిప్‌పై కేంద్ర మంత్రి కీలక ప్రకటన.. ఈ ఏడాదిలోనే విడుదల : అశ్వినీ వైష్ణవ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 16, 2025
12:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

తొలి మేడ్ ఇన్ ఇండియా చిప్‌ విడుదలకు కేంద్రం సిద్ధమైంది. ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ నాటికి దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి చిప్‌ను మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన కీలక వివరాలను వెల్లడించారు. ఇది దేశ సాంకేతిక స్వావలంబనలో నూతన ఒరవడిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

Details

సెమీకండక్టర్ స్వావలంబన దిశగా వేగంగా అడుగులు 

సెమీకండక్టర్ల ఉత్పత్తిలో స్వావలంబనను సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేస్తోంది. తాజాగా భారత ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలోకి రూ.13,162 కోట్ల పెట్టుబడులొచ్చాయని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. మరిన్ని పెట్టుబడులు రాబోయే దిశగా కృషి జరుగుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం 234 విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులకు అత్యాధునిక సెమీకండక్టర్ డిజైన్ సాధనాలను అందజేస్తున్నామని తెలిపారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 1.0ను పూర్తి చేయడానికి ఐటీ మంత్రిత్వ శాఖ కృషి చేస్తోందని చెప్పారు. అయితే మొహాలీలోని సెమీకండక్టర్ ల్యాబ్ ఆధునీకరణ ఇంకా పెండింగ్‌లో ఉందని, ఇది పూర్తయిన తర్వాత ISM 2.0 కోసం కార్యాచరణ చేపట్టనున్నట్లు వివరించారు.

Details

 గుజరాత్‌లో సెమీకండక్టర్ ఫ్యాబ్.. ప్రభుత్వ ప్రోత్సాహం 

తైవాన్‌కు చెందిన పవర్‌చిప్ సెమీకండక్టర్ మానుఫాక్చరింగ్ కార్పొరేషన్‌తో కలిసి టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ గుజరాత్‌లోని దొలేరాలో సెమీకండక్టర్ ఫ్యాబ్‌ను నిర్మిస్తోంది. దీని ద్వారా దేశీయంగా అధునాతన చిప్ తయారీకి మార్గం సుగమం కానుంది. ఇక బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో గాలియం నైట్రైడ్ పరిశోధన, అభివృద్ధి కోసం రూ.334 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు.

Details

 PLI పథకంతో సెమీ కండక్టర్ రంగానికి ఊతం

సెమీకండక్టర్ ఉత్పత్తికి సంబంధించి ప్రభుత్వం త్వరలో విడిభాగాల తయారీ కోసం ఉత్పత్తి-సంబంధిత ప్రోత్సాహక (PLI) పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా దేశీయ పరిశ్రమలకు మరింత మద్దతు లభించనుంది. 2025 సెప్టెంబర్-అక్టోబర్ నాటికి తొలి మేడ్ ఇన్ ఇండియా చిప్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టే దిశగా ప్రభుత్వ యంత్రాంగం వేగంగా పని చేస్తున్నట్లు అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు.