
Indian Rupee: అమెరికా టారిఫ్‌ల దెబ్బ.. రికార్డు స్థాయిలో రూపాయి పతనం
ఈ వార్తాకథనం ఏంటి
భారత రూపాయి (Indian Rupee) అమెరికా డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే అత్యంత కనిష్ఠ స్థాయికి క్షీణించింది. భారీ స్థాయిలో విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోవడం, అమెరికా విధించిన అధిక టారిఫ్‌లు రూపాయి విలువను తీవ్రంగా ఒత్తిడికి గురిచేశాయి. మంగళవారం ఉదయం ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్‌లో రూపాయి మరో 6 పైసలు బలహీనపడి 88.16 వద్ద సరికొత్త కనిష్ఠాన్ని నమోదు చేసింది. నేడు రూపాయి 88.14 వద్ద ప్రారంభమై వెంటనే 88.16 స్థాయికి చేరింది. ఇప్పటికే సోమవారం 88.10 వద్ద ఆల్‌టైమ్ కనిష్ఠంలోనే ముగిసింది. ట్రేడింగ్ సమయంలో ఒక దశలో రూపాయి 88.33 అనే అతి తక్కువ స్థాయిని తాకింది.
Details
పెట్టుబడిదారుల వెనుకడుగుతోనే రూపాయి పతనానికి కారణం
అమెరికా టారిఫ్‌ల ఒత్తిడి, విదేశీ పెట్టుబడిదారుల వెనుకడుగు రూపాయి పతనానికి ప్రధాన కారకాలు అయ్యాయి. సీఆర్ ఫారెక్స్ అడ్వైజర్స్ మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ పబారి మాట్లాడుతూ, అమెరికా టారిఫ్‌ల కారణంగా భారత ఎగుమతుల పోటీతత్వం దెబ్బతింటోంది. దీంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు వేచి చూడకుండా నిధులను వెనక్కి తీసుకుంటున్నారు. కేవలం మూడు ట్రేడింగ్ సెషన్లలోనే భారత ఈక్విటీల నుంచి 2.4 బిలియన్ డాలర్లు వెనక్కి వెళ్ళిపోయాయి. ఇది కరెన్సీతో పాటు ఈక్విటీ మార్కెట్లలోనూ తీవ్ర అస్థిరతకు కారణమవుతోందని వ్యాఖ్యానించారు. ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం సోమవారం ఒక్కరోజే విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FII) రూ.1,429.71 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు.
Details
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
ఇక అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ పరిణామాలపై స్పందిస్తూ, భారత్ తన టారిఫ్‌లను సున్నాకి తగ్గించడానికి అంగీకరించినా ఇప్పటికే ఆలస్యమైందని పేర్కొన్నారు. భారత్ ప్రధానంగా రష్యా నుంచే చమురు, సైనిక ఉత్పత్తులను కొనుగోలు చేస్తోందని, అమెరికాతో చాలా తక్కువ వాణిజ్యం కొనసాగుతోందని ఆయన తన 'ట్రూత్ సోషల్' వేదికలో పోస్ట్ చేశారు. రూపాయి పతనం కొనసాగుతున్నా దేశీయ స్టాక్ మార్కెట్ లు మాత్రం లాభాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ 0.08% పెరిగింది. మరోవైపు బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 68.45 డాలర్ల వద్ద ఉంది. నిపుణుల అంచనాల ప్రకారం, రూపాయి 88.50 వద్ద నిరోధాన్ని, 87.50 వద్ద మద్దతును ఎదుర్కొనే అవకాశముంది.