Vishal Mega Mart IPO: డిసెంబర్ 11 నుంచి ప్రారంభం కానున్న విశాల్ మెగామార్ట్ ఐపీఓ..₹8 వేల కోట్లు సమీకరణే లక్ష్యం
గురుగ్రామ్ కేంద్రంగా దేశవ్యాప్తంగా సూపర్‌మార్కెట్లను నిర్వహించే విశాల్ మెగామార్ట్ తన తొలి పబ్లిక్ ఇష్యూను (Vishal Mega Mart IPO) ప్రకటించింది. ఈ ఐపీఓ ద్వారా మార్కెట్ నుంచి రూ. 8 వేల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. డిసెంబర్ 11న ప్రారంభమయ్యే ఈ ఐపీఓ 13న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం డిసెంబర్ 10న బిడ్డింగ్ విండో ప్రారంభం అవుతుంది. ఐపీఓ ధరలు ఇంకా వెల్లడికాలేదు. ఈ ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) రూపంలో జరుగుతుంది. సమయత్ సర్వీసెస్ ఎల్‌ఎల్‌పీ, విశాల్ మెగామార్ట్ ప్రమోటర్ సంస్థ, ఈ ఐపీఓ ద్వారా తన వాటాలను విక్రయించనుంది.
దేశవ్యాప్తంగా 626 స్టోర్లు
ప్రస్తుతం ఈ సంస్థకు విశాల్ మెగామార్ట్‌లో 96.55 శాతం వాటా ఉంది. కొత్తగా షేర్లు జారీ చేయడం లేదు, అంటే మార్కెట్ నుంచి సమీకరించిన మొత్తం నిధులు ఆ సంస్థ వాటాదారులకు మాత్రమే చేరుకుంటాయి. ఈ పబ్లిక్ ఇష్యూ కోసం సెబీకి కాన్ఫిడెన్షియల్ మార్గంలో దరఖాస్తు చేయగా, సెప్టెంబర్ 25న గ్రీన్ సిగ్నల్ లభించింది. విశాల్ మెగామార్ట్ ప్రధానంగా మధ్య, దిగువ మధ్యతరగతి వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని వివిధ నగరాల్లో స్టోర్లు స్థాపించింది. 2024 జూన్ 30 నాటికి దేశవ్యాప్తంగా 626 స్టోర్లను ఏర్పాటు చేసింది.
మొబైల్ యాప్,వెబ్‌సైట్ ద్వారా కూడా విక్రయాలు
మొబైల్ యాప్,వెబ్‌సైట్ ద్వారా కూడా విక్రయాలు జరుగుతున్నాయి. తమ రిటైల్ స్టోర్లలో ఇన్‌హౌస్, థర్డ్ పార్టీ బ్రాండ్లను విక్రయిస్తోంది. దుస్తులు, జనరల్ ఉత్పత్తులు, ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులు ఈ స్టోర్లలో అందుబాటులో ఉంటాయి. ఈ పబ్లిక్ ఇష్యూకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఇంటెన్సివ్ ఫిస్కల్ సర్వీసెస్, జెఫ్రీస్ ఇండియా, జేపీ మోర్గాన్ ఇండియా, మోర్గాన్ స్టాన్లీ ఇండియా పనిచేస్తున్నాయి.