Page Loader
UPI app: యూపీఐ వినియోగదారులకు హెచ్చరిక.. ఇకపై బ్యాలెన్స్ చెక్‌కు 50 సార్లు మాత్రమే ఛాన్స్!
యూపీఐ వినియోగదారులకు హెచ్చరిక.. ఇకపై బ్యాలెన్స్ చెక్‌కు 50 సార్లు మాత్రమే ఛాన్స్!

UPI app: యూపీఐ వినియోగదారులకు హెచ్చరిక.. ఇకపై బ్యాలెన్స్ చెక్‌కు 50 సార్లు మాత్రమే ఛాన్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 01, 2025
09:28 am

ఈ వార్తాకథనం ఏంటి

నగదు రహిత లావాదేవీల వినియోగం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) యాప్‌లు వినియోగదారులను ఆకర్షించేందుకు నూతన సేవలను అందిస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంక్ ఖాతాలో ఎన్ని నగదు నిల్వలు ఉన్నాయో తెలుసుకోవడం ప్రధాన సౌకర్యంగా నిలుస్తోంది. దీంతో బ్యాంకు శాఖలకు లేదా ఏటీఎంలకు వెళ్లే అవసరం లేకుండానే, చాలా మంది రోజులో ఎన్నోసార్లు యూపీఐ యాప్‌ల ద్వారానే తమ ఖాతా నిల్వను పరిశీలిస్తున్నారు. అయితే ఈ తరచూ జరిగే బ్యాలెన్స్ తనిఖీల వల్ల నెట్‌వర్క్‌పై భారం పెరుగుతోంది. దీన్ని తగ్గించేందుకు, వినియోగదారులకు మెరుగైన, అంతరాయం లేని సేవలు అందించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) కొన్ని పరిమితులను విధించబోతోంది.

Details

ప్రతి యాప్‌కి 50 సార్లు చొప్పున తనిఖీ

ఈ మేరకు బ్యాంకులు, యూపీఐ సేవల సంస్థలకు అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నూతన మార్పుల ప్రకారం, వినియోగదారులు రోజుకు గరిష్ఠంగా 50 సార్లు మాత్రమే తమ బ్యాలెన్స్‌ను యూపీఐ యాప్ ద్వారా తనిఖీ చేయగలరు. ఒకరు రెండు యూపీఐ యాప్‌లు వాడుతున్నట్లయితే, ప్రతి యాప్‌కి 50 సార్లు చొప్పున తనిఖీ చేసే వీలుంటుంది. అలాగే, విజయవంతమైన లావాదేవీ తర్వాత ఖాతాలో మిగిలిన బ్యాలెన్స్‌ను వినియోగదారులకు చూపించాలన్న ఆదేశాలు బ్యాంకులకు జారీ అయ్యాయి. అంతేగాక ఏపీఐ (అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేసెస్) ఆధారిత లావాదేవీలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు వినియోగదారుల అనుమతితోనే జరగాలని సూచించారు.

Details

ఆగస్టు 1 నుంచి అమలు

ఇక ఆటోమేటెడ్ చెల్లింపులు ఉదాహరణకు SIPలు, ఓటీటీ సేవల చందాల వంటి రకాల చెల్లింపులు. రద్దీ లేని సమయాల్లోనే ప్రాసెస్ చేయాలని, రద్దీ సమయంలో చెల్లింపు అభ్యర్థన మాత్రమే తీసుకొని, చెల్లింపును తక్కువ ట్రాఫిక్ ఉన్న సమయంలో చేయాలని స్పష్టం చేశారు. ఈ కొత్త మార్పులు 2025 ఆగస్టు 1 నుండి అమల్లోకి రానున్నాయని ఎన్‌పీసీఐ వెల్లడించింది. వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరిచేందుకు, వ్యవస్థలపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ చర్యలు కీలకమవుతాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.