
World Bank: పని చేసే జనాభా కంటే వేగంగా ఉద్యోగాల వృద్ధి.. ప్రపంచ బ్యాంకు నివేదిక
ఈ వార్తాకథనం ఏంటి
భారత ఉపాధి రంగంలో సానుకూల మార్పులు చోటుచేసుకుంటున్నాయని ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక వెల్లడించింది.
2021-22 నుండి దేశ కార్మిక మార్కెట్‌లో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయని, పని చేయగల జనాభా కంటే వేగంగా ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని పేర్కొంది.
మహిళల శ్రామిక శక్తిలో పాల్గొనడం పెరుగుతున్నది కూడా ప్రత్యేకంగా హైలైట్ చేసింది. మూడేళ్లుగా ఉద్యోగాల వృద్ధి స్థిరంగా కొనసాగుతుందని, పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం తగ్గుముఖం పట్టిందని వెల్లడించింది.
2017-18 ఆర్థిక సంవత్సరం తర్వాత నిరుద్యోగ స్థాయి క్రమంగా తగ్గి 2021-22 నాటికి 6.6 శాతానికి చేరిందని తెలిపింది. ఇది కరోనా అనంతరం ఉపాధి పునరుద్ధరణకు సూచికగా పేర్కొంది.
గణనీయంగా మారిన మరో అంశం వలసల ప్రభావం.
Details
ప్రపంచ బ్యాంకు ఆందోళన
గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఉద్యోగాల కోసం పట్టణాలకు వలసవస్తుండటంతో పురుషుల వలస రేటు పెరిగిందని పేర్కొంది. ఇదే సమయంలో, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు వ్యవసాయ రంగంలో అధికంగా ప్రవేశిస్తున్నారని వివరించింది.
అయితే మహిళల ఉద్యోగాల్లో వృద్ధి ఉన్నప్పటికీ వేతనాల్లో లింగ అసమానతలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపింది.
అయితే ఉపాధి వృద్ధి ఉన్నా నిరుద్యోగ యువత రేటు పెరుగుతుండటంపై ప్రపంచ బ్యాంకు ఆందోళన వ్యక్తంచేసింది.
భారత్‌లో యువ నిరుద్యోగిత 13.3 శాతంగా ఉందని, ఉన్నత విద్య పూర్తిచేసిన వారిలో 29 శాతం మంది ఇంకా ఉద్యోగం కోసం వెతుకుతున్నారని పేర్కొంది.
Details
పేద రాష్ట్రాలుగా బిహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్
పేదరికం కాస్త తగ్గినప్పటికీ ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఇంకా అత్యంత పేద రాష్ట్రాలుగా ఉన్నాయని వివరించింది.
ఈ నేపథ్యంలో, స్థిరమైన ఆర్థిక సంస్కరణలు, పెట్టుబడుల వృద్ధి ద్వారా మాత్రమే ఉపాధి రంగాన్ని మరింత బలోపేతం చేయచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు.